చెన్నై: హమ్మయ్య..ఐపీఎల్లో ఎట్టకేలకు ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ బోణీ కొట్టింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడి అభిమానులను ఘోరంగా నిరాశపరిచిన చెన్నై సొంత ఇలాఖాలో జూలు విదిల్చింది. శనివారం జరిగిన పోరులో చెన్నై 23 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత శాంసన్(56 బంతుల్లో 115 నాటౌట్, 15ఫోర్లు, 4సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెన్నై 20 ఓవర్లలో 212/2 స్కోరు చేసింది. బ్యాటింగ్ భారాన్ని తనపై వేసుకున్న శాంసన్ రాణించడంతో చెన్నై భారీ స్కోరు అందుకుంది. యువ బ్యాటర్ ఆయూశ్ మాత్రె(36 బంతుల్లో 59, 3ఫోర్లు, 4సిక్స్‌లు) మరోమారు అవకాశాన్ని చక్కగా అందిపుచ్చుకున్నాడు. గత మ్యాచ్‌ల వైఫల్యాలను చెరిపేస్తూ ఓపెనర్లు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్(15) చెన్నైకి చక్కని శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు ఢిల్లీ బౌలింగ్‌ను చాకచక్యంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అక్షర్ బౌలింగ్‌లో రుతురాజ్ ఔటైనా శాంసన్ తన దాడిని తగ్గించలేదు.
మాత్రెతో కలిసి పతాక స్థాయికి తీసుకెళ్లాడు. ఇద్దరు పోటాపోటీగా పరుగులు సాధించడంతో చెన్నై 10.4 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. ఈ క్రమంలో శాంసన్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, మాత్రె 27 బంతుల్లో మార్క్ అందుకున్నాడు. ఈ ఇద్దరు ఢిల్లీ బౌలర్లకు పరీక్ష పెట్టగా, మాత్రె రిటైర్డ్హర్ట్తో వెనుదిరిగినా..ఆఖర్లో శివమ్ దూబే(20 నాటౌట్)తో కలిసి శాంసన్..ఐపీఎల్లో నాలుగో సెంచరీని తన పేరిట లిఖించుకున్నాడు. అక్షర్‌కు ఏకైక వికెట్ దక్కింది. లక్ష్యఛేదనలో రాహుల్(18), నిస్సనక(41) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించగా, ఓవర్ వ్యవధిలోనే ఔట్ కావడంతో ఢిల్లీ గెలుపు అవకాశాలు దెబ్బతిన్నాయి. రిజ్వి(6), అక్షర్(1), మిల్లర్(17) ఇలా వచ్చి అలా వెళ్లగా స్టబ్స్(38 బంతుల్లో 60, 4ఫోర్లు, 3సిక్స్‌లు) వీరోచిత అర్ధసెంచరీ జట్టును గెలుపు తీరాలకు చేర్చలేకపోయింది. మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో స్టబ్స్ పోరాటం వృథా అయ్యింది. ఓవర్టన్(4/18), కంబోజ్(3/35) ఢిల్లీని దెబ్బతీశారు. శాంసన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 212/2(శాంసన్ 115 నాటౌట్, మాత్రె 59, అక్షర్ 1/39), ఢిల్లీ: 20 ఓవర్లలో 189 ఆలౌట్(స్టబ్స్ 60, నిస్సనక 41, ఓవర్టన్ 4/18, కంబోజ్ 3/35)