Liquor Brands | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అనధికారిక మద్యం పాలసీకి తెరతీసిన ప్రభుత్వ పెద్దలు.. తమ పథకాన్ని దశలవారీగా అమలు చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో ఇక నుంచి తెలంగాణలో ఏయే మద్యం బ్రాండ్లు ఉంటాయో, ఏవి కనుమరుగవుతాయో.. కొత్తగా ఏం వస్తాయో తెలియని స్థితి నెలకొంది. వారం పదిరోజులుగా కొన్ని లిక్కర్ బ్రాండ్లు మద్యం షాపుల్లో అందుబాటులో లేకపోవడంతో మద్యంప్రియులు ఆందోళన చెందుతున్నారు. తమకు అలవాటైన బ్రాండ్లనే ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. వేరే బ్రాండ్ల మద్యం తాగేందుకు మనసొప్పడం లేదని వాపోతున్నారు. కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఎలాంటి పరిమితులు లేకపోవడంతో ప్రభుత్వ పెద్దలు తమ పథకాన్ని సులువుగానే అమలు చేయనున్నారని సమాచారం.
ఆరోపణలపై నోరు మెదపని పెద్దలు
మద్యం సప్లయర్స్‌లో ఒకరైన ఓ మంత్రి తమ్ముడు ‘కొత్త కమీషన్ దందా’లో చక్రం తిప్పుతున్నట్టు సమాచారం. మద్యం వ్యాపారుల్లో కొత్త బ్రాండ్ల ప్రమోషన్‌పై విపరీతమైన చర్చ జరుగుతున్నా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తమ్ముడు, మంత్రి స్పందించకపోవడం ఆరోపణలకు బలం చేకూర్చుతున్నది. అనధికారిక మద్యం పాలసీలో ఏడాదికి సుమారు రూ.5వేల కోట్లకు పైగా డబ్బులు వెనకేసుకుందామని భావిస్తున్న ఆ ప్రభుత్వ పెద్ద ఎవరనే దానిపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది. దీనిపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కొరత లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ పెండింగ్‌లో పెట్టిన ఇండెంట్లను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే భావనతో ఓ అడుగు వెనక్కి వేసినట్టు సమాచారం.