అత్తాపూర్‌లో కొత్తగా విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఒక స్థలం కేటాయించారు. తాళ్లకుంట సమీపంలోని సెంట్రల్కస్టమ్స్ కార్యాలయం పక్కనే స్థలాన్ని రెవెన్యూ అధికారుల కేటాయించిన తర్వాత విద్యుత్ అధికారులు అక్కడ పనులు మొదలుపెట్టారు. ఈ లోగా భూమి తమ పరిధిలోకి వస్తుందంటూ కస్టమ్స్ శాఖ చెప్పడంతో మరోసారి సర్వే చేసిన తర్వాత పనులు చేయాలని ఆర్డీవో చెప్పారు.
కొండాపూర్ పరిధిలో రెండు సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని అవి శ్రీరాంనగర్ సమీపంలోని బొటానికల్ గార్డెన్, పోలీసుల పటాలం, గోల్డెన్తులిప్కాలనీల సమీపంలో 33 బై 11 సబ్స్టేషన్ల నిర్మాణానికి నిర్ణయించారు. ఒక్కో సబ్‌స్టేషన్ ఏర్పాటుకు 1500-2000 గజాల స్థలం అవసరం. ఇండోర్ సబ్‌స్టేషన్‌కు కనీసం ఆరు వందల గజాల జాగ కావాలి. కొండాపూర్‌లో ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్మాణాల ప్రక్రియ కాగితాలకే పరిమితమైంది. పోలీసు పటాలంలో కొంత స్థలం కేటాయిస్తే తాము అక్కడ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని ఈ విషయంలో పోలీసు, రెవెన్యూ అధికారుల చొరవ ఉంటే తప్ప స్థలం రాదని విద్యుత్ అధికారులు తెలిపారు. దక్షిణ డిస్కం పరిధిలో గ్రేటర్లో ప్రతిపాదించిన సబ్స్టేషన్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలకు ఉదాహరణలు మాత్రమే ఇవి.
సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా 88 సబ్స్టేషన్లు నిర్మించాలని టీజీఎస్పీడీసీఎల్ గుర్తించింది. వీటి నిర్మాణానికి ముందుగా గ్లోబల్ టెండర్లు పిలిచారు. మూడు సార్లు టెండర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఎవరూ ముందుకు రాకపోవడంతో ఒక్కొక్కటిగా టెండర్లు పిలుస్తున్నారు. అయితే ముందుగా స్థలాల సమస్యలేని వాటిని గుర్తించి వాటికి సంబంధించి టెండర్లను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి టీజీఎస్పీడీసీఎల్ సిద్ధంగా ఉన్నప్పటికీ, నిర్మాణాలకు అవసరమైన భూములు అందుబాటులో లేకపోవడం, రెవెన్యూ యంత్రాంగం కేటాయించిన భూములపై అనేక వివాదాలు కొనసాగుతుండడం, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచకపోవడంతో కొత్త సబ్స్టేషన్ల నిర్మాణ ప్రక్రియ వెనకబడుతోంది.
కొత్త సబ్స్టేషన్ల నిర్మాణానికి స్థల లభ్యత ప్రధాన అడ్డంకిగా మారింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ జోన్ల పరిధిలో రూ.420 కోట్ల అంచనా వ్యయంతో వచ్చే ఏడాది చివరి నాటికి 88 కొత్త 33 11 కేవీ సబ్స్టేషన్లు నిర్మించాలని టీజీఎస్పీడీసీఎల్ మిగతా నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూములను కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాసింది. కోర్‌సిటీలో అనువైన భూములు లేకపోవడం, ఉన్నవి కూడా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోవడం, శివారు ప్రాంతాల్లో కేటాయించిన భూములపై కూడా పలు వివాదాలు కొనసాగుతుండడం తదితర కారణాలతో టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఔత్సాహిక కంపెనీలు ముందుకు రావడం లేదు. అయితే రాజకీయపరమైన ఒత్తిళ్ల కారణంగా ఈ టెండర్లు దక్కించుకోవడానికి ఓ సంస్థ ప్రదర్శించిన అత్యుత్సాహం గ్రేటర్‌సిటీలో సబ్స్టేషన్ల నిర్మాణాలకు అడ్డు తగిలిందనే చెప్పాలి. దీంతో విధిలేని పరిస్థితుల్లో డిస్కం సర్కిళ్ల వారీగా టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటివరకు ఆరు సబ్స్టేషన్లకు టెండర్లు ఖరారు చేయగా, తాజాగా మరో నాలుగు సబ్స్టేషన్లకు టెండర్లు ఆహ్వానించింది.
కోర్‌సిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో సబ్స్టేషన్లకు భూముల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. బంజారాహిల్స్ సర్కిల్లో 5, సికింద్రాబాద్ పరిధిలోని 13,హైదరాబాద్ సెంట్రల్ పరిధిలో 8, సౌత్ పరిధిలో 10 ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి సిద్ధమైనా భూములు దొరకడం లేదు. అదే విధంగా రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ.. డిస్కంకు కేటాయించిన భూముల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కోర్టు పరిధిలో ఉండగా, మరికొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిని విడిపించి డిస్కం ఇంజినీర్లకు అప్పగించడంలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. భూములు కేటాయిస్తే కేవలం ఏడాదిలోపే సబ్స్టేషన్లు నిర్మించనున్నారు. సైబర్ సిటీ సర్కిల్ పరిధిలో మోకి, నెక్నంపూర్, బొటానికల్ గార్డెన్, నల్లగుండ్లహుడా, హఫీజ్‌పేట, 8వ బెటాలియన్ సహా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గౌస్‌నగర్, కింగ్స్ కాలనీ, నూరినగర్, మీరాలం పార్క్, బైరాగిగూడ, హుడాహెచ్ఎస్బీ, శాతంరాయి, పీఅండ్‌టీ కాలనీ, ఓమన్నగర్, లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర చోట్ల సబ్స్టేషన్లు వస్తాయి. సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలో మన్సూరాబాద్ పెద్ద చెరువు, బీఎన్‌రెడ్డినగర్, హెచ్ఎండబ్ల్యూఎస్ సాహెబ్‌నగర్, బడంగ్‌పేట డంపింగ్‌యార్డ్, బండ్లగూడ ఎస్టీపీ ప్లాంట్, కుంట్లూరు మదర్ డెయిరీ వద్ద కొత్త సబ్స్టేషన్లు వస్తాయి. స్థలాలు దొరికితే ఈ ప్రాంతాల్లో సబ్స్టేషన్లు వస్తాయని అధికారులు చెప్పారు.మేడ్చల్ జోన్లో ప్రతిపాదించిన ప్రాంతాల్లో సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుకూలంగా స్థలాలు ఉండడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని డిస్కం అధికారులు చెప్పారు.