ఎన్టీఆర్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హైఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత శక్తివంతంగా ఉంటుందని చెబుతున్నారు. మాఫియా నేపథ్య కథాంశమిదని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఓ కీలకమైన షెడ్యూల్ కోసం చిత్రబృందం ఈ నెల రెండోవారంలో యూరప్‌కు పయనం కానుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్‌మీడియాలో వస్తున్న ఓ రూమర్‌పై దర్శకుడు ప్రశాంత్‌నీల్ స్పష్టతనిచ్చారు.
ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో రెండో భాగాన్ని కూడా తీసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ప్రశాంత్‌నీల్ డైరెక్ట్ చేసిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా తెరకెక్కింది. ‘సలార్’ రెండో భాగం కూడా ‘శౌర్యాంగపర్వం’గా రానుంది. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ కూడా రెండు భాగాలుగా వస్తుందని రూమర్ మొదలైంది. ఈ వార్తలను ప్రశాంత్‌నీల్ టీమ్ ఖండించింది. సినిమాపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని, కేవలం ఒకే భాగంగా రానున్న శక్తివంతమైన కథ ఇదని పేర్కొంది. దాంతో రూమర్స్‌కు చెక్ పడినట్లయింది.