కర్నూలు సమీపంలో జరిగిన భారీ రోడ్డు ప్రమాదానికి చెందిన విషాదం ఇంకా మరువకముందే.. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగు రాష్ర్టాలను ఉలిక్కిపడేలా చేసింది. తాండూరు డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సుని కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో 24మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఈ విషాదం కారణంగా సినిమా అప్డేట్లను పంచుకోవడం సరికాదని కొన్ని చిత్ర నిర్మాణ సంస్థలు సోమవారం విడుదల చేయాల్సిన అప్డేట్లను వాయిదా వేశాయి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలు ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ తమ సోషల్ మీడియా ద్వారా సానుభూతి వ్యక్తం చేశాయి.
బాలకృష్ణ కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై సతీశ్ కిలారు నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 7న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్నది. ఇందులో నయనతార కథానాయికగా ఎంపికయ్యారు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాలో నయనతార ఓ మహారాణి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ను సోమవారం విడుదల చేయనున్నట్టు మేకర్స్ గతంలో ప్రకటించారు.
అయితే.. చేవెళ్ల బస్సు ప్రమాద దుర్ఘటన కారణంగా ఈ అప్డేట్ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. అలాగే.. కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘NC 24’(వర్కింగ్ టైటిల్) సినిమాకు సంబంధించిన అప్డేట్ను కూడా సదరు మేకర్స్ వాయిదా వేశారు. ఈ సినిమాలో చైతూకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నది. ఆమె పాత్రకు సంబంధించిన అప్డేట్ను సోమవారం విడుదల చేయాలని చిత్రబృందం భావించారు. చేవెళ్ల ఘటన కారణంగా ఈ అప్డేట్ని నేటికి(మంగళవారం) వాయిదా వేశారు.