‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా సిద్ధు జొన్నలగడ్డ చేసిన మరో ప్రయత్నం ‘టిల్లు స్కేర్’. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్‌రామ్ గురువారం విలేకరులతో ముచ్చటించారు. ‘సిద్ధుతో నా పరిచయం ఈనాటిది కాదు. కెరీర్ కూడా కలిసే మొదలుపెట్టాం. కలిసి సినిమా చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. అయితే ఇద్దరం ఎవరి బిజీలో వాళ్లు ఉండిపోయాం. సిద్ధు హీరోగా బిజీ. నేను నరుడా డోనరుడా, అద్భుతం సినిమాల తర్వాత ‘పెళ్లిగోల’ అనే వెబ్‌సిరీస్ చేశాను. అది మంచి హిట్.’ అని చెప్పారు.
ఇంకా మాట్లాడుతూ ‘ఓ విధంగా నాగవంశీ మా ఇద్దర్నీ కలిపారు. ‘టిల్లు స్కేర్’ చేస్తే బావుంటుందనే ఐడియా ఆయనదే. అదేటైమ్‌లో ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్‌కృష్ణ ఇతర కమిట్మెంట్స్తో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ నా దగ్గరకొచ్చింది. ముందు సంకోచించా. కథ నచ్చే సరికి ఓకే అనేశా. ’ అని చెప్పారు. మరికొన్ని విషయాలు ప్రస్తావిస్తూ ‘ ‘డీజే టిల్లు’ దర్శకుడి కంటే హీరోకే మంచి పేరు తెచ్చినమాట నిజం. ఈ సీక్వెల్ విషయంలో కూడా అదే జరిగితే నిజంగా నేను హ్యాపీనే. ఎందుకంటే ఇది సిద్ధు బ్రెయిన్ ఛైల్డ్. అతనికి ఈ కథపై ఓ పరిపూర్ణమైన అవగాహన ఉంది.
ఈ పాత్ర ఎలా చేయాలో ఒక ఆలోచన ఉంది. అందుకే ఎక్కువ క్రెడిట్ అతనికి వస్తే ఒక స్నేహితుడిగా హ్యాపీనే. ఒకటి మాత్రం నిజం. దర్శకుడిగా నాకు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంతా ఇచ్చాడు సిద్ధు. నా కథలే కాదు, ఇతరుల కథల్ని కూడా నేను బాగా డీల్ చేయగలను. ఆ కెపాసిటీ నాకుంది. ‘టిల్లు స్కేర్’తో అది రుజువుకానుంది’ అని నమ్మకం వ్యక్తం చేశారు మల్లిక్‌రామ్. పేరుకు తగ్గట్టే ‘డీజే టిల్లు’కు రెండింతలు ఎక్కువే ఈ సినిమా వినోదాన్ని పంచుతుందని, ‘డీజే టిల్లు’లో రాధిక ఎంత పాపులర్ అయిందో, ఇందులో ‘లిల్లీ’ అంతకంటే ఎక్కువ పాపులర్ అవుతుందని, ‘లిల్లీ’గా అనుపమ పరమేశ్వరన్ నటన ఇందులో హైలైట్ అని, సాంకేతికంగా అన్ని విభాగాలు అభినందనీయంగా ఉంటాయని ఆయన తెలిపారు.