‘మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి.. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకోవాలి.. నానాటికీ విస్తరిస్తున్న పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలవాలి.. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి..’ అనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల బలోపేతానికి చర్యలు తీసుకున్నారు.. సర్కార్ స్కూళ్లలో తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్నీ అమలు చేస్తున్నారు.. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది.. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ అమలు చేస్తామని ప్రకటించడంతో అన్ని వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కూసుమంచి, మార్చి 6: ప్రైవేటు స్కూళ్లలో ఫీ‘జులుం’ పోవాలి.. ప్రభుత్వ స్కూళ్లలో వందశాతం ఇంగ్లిష్ మీడియం అమలు చేయాలి.. విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపే మళ్లాలి.. అనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే అనేకచోట్ల ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నది. ఖమ్మం జిల్లాలోని 21 మండలాల్లోని పాఠశాలల్లో 70 శాతం ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. 2008లో అప్పటి పాలకులు సక్సెస్ స్కూళ్ల ప్రతిపాదన చేసినప్పటికీ వాటికి తగిన నిధులు విడుదల చేయకపోవడంతో అవి అర్ధాంతరంగా నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) విధానాన్ని అమలు చేసి సక్సెస్ అయింది. జిల్లావ్యాప్తంగా 1,215 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 7, 8, 9, 10 తరగతులు మినహా మిగిలిన అన్ని తరగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారే ఎక్కువ.
సమస్యల లోగిళ్ల నుంచి సర్కారు బడులు బయటపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. దీంతో మూడేళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అందుకు తగిన వనరులు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఇష్టంగా చదువుకుంటున్నారు. జిల్లాలోని 21 మండలాలకు గాను 11 మండలాల్లో ఇంగ్లిష్ మీడియం చదువుతున్న విద్యార్థులే ఎక్కువ. సీఎం కేసీఆర్ ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఉదాహరణకు కూసుమంచి మండంలో 67 పాఠశాలలు ఉండగా ఇప్పటి 36 పాఠశాలల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. కేవలం 11 పాఠశాలల్లోనే తెలుగు మీడియం, 19 పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్ మీడియాలు అమలవుతున్నాయి. ఈ చొప్పున జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 70శాతం ఇంగ్లిష్ మీడియం చదువుతున్న వారే. ఒక్క కూసుమంచి హైస్కూల్లోనే 569 మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారంటే ఆంగ్లానికి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించవచ్చు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,215 ప్రభుత్వ పాఠశాలల్లో 750 పాఠశాలలకు పైగా ఇప్పటికే ఇంగ్లిష్ మీడియం అమలవుతున్నది. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం అమలైతే ఇక ప్రతిఒక్కరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదువుకుంటారు.
నా భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. నాకు ఇద్దరు ఆడపిల్ల్లలు. పెద్దమ్మాయి అన్నపురెడ్డిపల్లి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతుంది. చిన్నమ్మాయి కూసుమంచి హైస్కూల్ల్లో 7వ తరగతి చదువుతుంది. ఇద్దరూ ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నారు. గతంలో ప్రైవేట్ పాఠశాలలో చదివించా. ఫీజులు చెల్లించే స్తోమత లేకపోయింది. ఇప్పుడు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. పైసా ఖర్చు లేకుండా వారిని చదివిస్తున్నా.
– బదావత్ సుజాత, విద్యార్థినుల తల్లి, హట్యాతండా
ఆంగ్ల మీడియంలో చదువుకుంటే జీవితంలో, కెరీర్లో రాణించవచ్చని తెలుసుకున్నా. ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతామని ప్రకటించడం ఆనందాన్నిచ్చింది. ఇది ఎంతో మంచి మార్పునకు పునాది అవుతుంది. మా పాఠశాలలో ఇప్పటికే తెలుగు మీడియం విద్యార్థుల కంటే రెట్టింపు ఇంగ్లిష్ మీడియం చదువుతున్నవారే ఎక్కువగా ఉన్నారు.
– ఉమేశ్ చంద్రన్, పదో తరగతి విద్యార్థి, కూసుమంచి
నేటి తరానికి ఇంగ్లిష్ మీడియం ఎంతో అవసరం. ప్రభుత్వం వచ్చే సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను మొదలుపెడుతుంది. ఇది శుభ పరిణామం. నిరుపేద విద్యార్థులకు ఇది ఒక వరం. ఇంగ్లిష్ మీడియంలో చదివిన విద్యార్థుల కంటే తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కెరీర్లో వెనుబడుతున్నారనేది వాస్తవం. ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ నేర్చుకోవాల్సిందే. అప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది.
-పింగళి రాజకుమారి, కేజీబీవీ ఇంగ్లిష్ టీచర్, కూసుమంచి
నేను ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదివాను. ఆరో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చేరాను. ఉన్నత చదువులకు ఇంగ్లిష్ ఎంతో అవసరం అని తెలుసుకున్నాను. ఇంగ్లిష్ మీడియం చదవడంలో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు. పదిలో 10కి 10 జీపీఏ సాధించాలనే లక్ష్యంతో చదువుతున్నా. కచ్చితంగా సాధిస్తాను.
– నవ్య, పదో తరగతి విద్యార్థిని, కూసుమంచి