హైదరాబాద్, అక్టోబర్4 (నమస్తే తెలంగాణ): ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్నచందంగా మారింది డిండి ఎత్తిపోతల పథకం పరిస్థితి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించేందుకు సత్వరమే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని నల్లగొండ జిల్లా మంత్రులు, ప్రజాపత్రినిధులు పట్టుబడుతున్నారు. పాలమూరు లిఫ్ట్ స్కీమ్‌లో భాగంగా చేపడితే తమకు తీరని నష్టమని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు దానిని వ్యతిరేకిస్తున్నారు.
ఫలితంగా ప్రాజెక్టు పనులు అడుగు కూడా ముందుకు పడని దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నేతల మధ్య సయోధ్య లేక ప్రాజెక్టు పడావు పడుతున్నదని ఇటు నల్లగొండ ప్రజలు, అటు అధికారులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 228 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలను, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగు, 3.61 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేలా దిండి లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్ (డీఎల్ఐఎస్)ను రూపొందించారు.
రూ.6,100 కోట్లతో గత కేసీఆర్ ప్రభుత్వం 2015లో పరిపాలనా అనుమతులను మంజూరు చేసింది. గతంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి ఈ ప్రాజెక్టుకు కృష్ణాజలాలను మళ్లించాలని తొలుత నిర్ణయించారు. తద్వారా పాత డిండి నుంచి ప్రధాన కాలువలు.. సింగరాజుపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడం రిజర్వాయర్ వరకు జలాలను తరలించేలా డిజైన్ రూపొందించారు. ఈ స్కీమ్‌లో భాగంగా మొత్తం 25.31 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 4 ఆన్లైన్ రిజర్వాయర్లు, 5 ఆఫ్‌లైన్ రిజర్వాయర్లను నిర్మించాలి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హెడ్‌వర్క్స్ మినహా దాదాపు 95శాతం పనులు పూర్తయ్యాయి. 3గ్రామాల పునరావాస సమస్యలు, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 180.14 హెక్టార్ల అటవీ భూమి సమస్యలు, స్పిల్ వేలో ఒక భాగం పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. ఇక డిండి ప్రాజెక్టు ప్రధాన హెడ్‌వర్క్స్ పనులపై మొదటి నుంచి పూర్తి సందిగ్ధం నెలకొన్నది. తొలుత శ్రీశైలం, తదుపరి నార్లాపూర్ నుంచి, తుదకు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండికి జలాలను తరలించాలని నిర్ణయించారు.
సర్వేలను పూర్తిచేసి పనులను ప్రారంభించే క్రమంలో బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఏదుల నుంచే డిండికి జలాలను తరలించాలని నిర్ణయించింది. ఆ పనులకు సంబంధించి రూ.1,800 కోట్లతో 2025 జనవరిలో జీవో 11 ద్వారా పరిపాలనా అనుమతులు జారీచేసింది. ఏదుల నుంచి డిండి వరకు మొత్తం 27.9 కిలోమీటర్ల మేర కాలువలు, సొరంగం పనులు చేపట్టాల్సి ఉన్నది. అందులో భాగంగా ఏదుల నుంచి 800 మీటర్ల మేర అప్రోచ్ కెనాల్, 2.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కాలువ, 16 కిలోమీటర్ల పొడవునా టన్నెల్, తదుపరి 3 కిలోమీటర్ల కాలువ ద్వారా జలాలను పోతిరెడ్డిపల్లి వాగుకు లింకు చేస్తారు.
6.3 కిలోమీటర్ల ఈ వాగుపై రబ్బర్ డ్యామ్ నిర్మించాల్సి ఉన్నది. అక్కడి నుంచి 1.5 కి.మీ. దిగువన ఉల్పర చెక్‌డ్యామ్‌కు, ఆపై అక్కడి నుంచి 7 కి.మీ. పాత డిండి కాలువల ద్వారా డిండికి లింకు చేస్తారు. డిండి నుంచి ఇప్పటికే నిర్మితమైన ఆయా రిజర్వాయర్లకు, ఆయకట్టుకు అందించాల్సి ఉన్నది. ఆయా అనుమతులిచ్చి రెండేండ్లు గడిచినా ఆ పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదంటే కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు అద్దం పడుతున్నది.
డిండి ఎత్తిపోతల పథకం పనులు ముందుకు సాగకపోవడానికి కాంగ్రెస్ నేతల మధ్య వైరమే కారణమని తెలుస్తున్నది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేందుకు తొలుత పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్) రూపొందించారు. అందుకోసం శ్రీశైలం నుంచి 120 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉన్నది. అదీగాక ప్రస్తుతం పీఆర్ఎల్ఐఎస్కు ఆయకట్టు మరింతగా పెరిగింది.
అదనంగా కల్వకుర్తితోపాటు, కొంత భాగం జూరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. దీంతో ఒక్క పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టు ఆయకట్టే దాదాపు 15లక్షల ఎకరాలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో డిండి ప్రాజెక్టును సైతం పాలమూరు నుంచి చేపడితే అదనంగా మరో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టు పెరుగనున్నది. ఈ నేపథ్యంలో నీటి సమస్యలు ఏర్పడుతాయని మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా నాయకులు, ఆ జిల్లా రైతాంగం వ్యతిరేకిస్తున్నది. డిండిని ప్రత్యేక లిఫ్ట్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నది.
సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తూ హెడ్‌వర్క్స్ పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు తక్షణమే డిండి ప్రాజెక్టు పనులను ఏదుల నుంచి చేపట్టాలని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, రైతులు పట్టుబడుతున్నారు. దేవరకొండ, మునుగోడు తదితర ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలని ఆ ప్రాంతాల ప్రజల నుంచి ఒత్తిడి వస్తున్నది. కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఎవరికి వారుగా పట్టుబడుతుండటంతో మొత్తంగా డిండి ప్రాజెక్టు పనులు అటకెక్కిన దుస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నేతల మధ్య వైరుధ్యాలతో అధికారులు సైతం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పనులను ముందుకు తీసుకెళ్లే విషయంలో సతమతమవుతున్నారు.