బడ్జెట్ ప్రతిపాదనల్లో అందర్నీ ఆలోచనల్లో పడేసినది క్రిప్టో ఆదాయంపై పన్నే. ఈ ప్రతిపాదనతో దేశంలో క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత వచ్చిందా? అన్నదానిపై అనుమానాలు రేకెత్తాయి మరి. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ రుపీని తీసుకురానుందన్న ప్రకటన కూడా బడ్జెట్ సందర్భంగానే వచ్చింది. దీంతో ఈ ప్రతిపాదనలు కొంత గందరగోళానికి దారి తీశాయి. క్రిప్టో కరెన్సీలు నడుస్తున్న బ్లాక్‌చైన్ టెక్నాలజీయే ఆర్బీఐ డిజిటల్ రుపీకి కూడా ఆధారం కావడమే ఇందుకు కారణం. అసలు క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధత వచ్చిందా? లేదా?.
డిజిటల్ రుపీకి అర్థమేంటి?
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: చైనాతోసహా కొన్ని దేశాలు సావరిన్ డిజిటల్ కరెన్సీల విషయంలో ప్రయోగాలు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో ప్రకటించిన డిజిటల్ రుపీతో భారత్ కూడా ఆ వైపు నడుస్తున్నదని తేలిపోయింది. అయితే క్రిప్టో కరెన్సీల్లాగే బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రుపీ నడువనున్నది. నిజానికి ప్రైవేట్ లేదా క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ లేకపోవడం వల్ల ఇన్వెస్టర్లకు భద్రత కరువైంది. ఆర్థిక నేరాలకూ అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ రుపీ రాబోతున్నది.
పరోక్షంగా చట్టబద్ధత
క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లపై పన్నులు విధించడం ద్వారా పరోక్షంగా వాటికి చట్టబద్ధత కల్పించినట్టే అయ్యింది. అయితే వీటిపై విధించిన పన్నులు మిగతా అసెట్లతో పోల్చితే చాలా ఎక్కువ. అన్ని రకాల క్రిప్టో ఆదాయాలపై 30 శాతం పన్ను విధించారు. జూదం లేదా లాటరీ ఆదాయాలపై విధించినట్టుగానే గరిష్ఠ పన్ను వేశారు. అలాగే అన్ని రకాల క్రిప్టో లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్‌ను తెచ్చారు. వీటి క్రయవిక్రయాలు జరుపుతున్నవారు చెల్లించాల్సిందేనని బ్యాంక్‌బజార్.కామ్ సీఈవో అదిల్ శెట్టి అన్నారు. ఈ పన్ను భారం వల్ల క్రిప్టోలలో ట్రేడింగ్ చేయడానికి చాలా మంది వెనుకాడవచ్చు. అలాగే ఆదాయాలపై ఎలాంటి డిడక్షన్స్ లేవు. నష్టాలను తీసివేయడాలు, వాటిని వచ్చే ఏడాదికి బదలాయించడాలు కూడా లేవు.
భవిష్యత్తు ఎలా..
సీబీడీసీ లీగల్ కరెన్సీ అని ఆర్థిక మంత్రి బడ్జెట్లో వివరణ ఇచ్చారు. క్రిప్టో కరెన్సీలతోపాటు నాన్ ఫంగిబుల్ టోకెన్స్ (ఆర్ట్ రూపంలో ఉండే క్రిప్టో కరెన్సీలు) కూడా డిజిటల్ కరెన్సీలే అని నిర్మలా సీతారామన్ స్పష్టత ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ బడ్జెట్ ప్రతిపాదనలు క్రిప్టో ట్రేడర్లను ఆందోళన నుంచి బయట పడేస్తుండగా, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకునే బ్లాక్‌చైన్ డెవలపర్లనూ ప్రోత్సహించేవిగా ఉన్నాయి. అయితే ఇన్వెస్టర్ల భద్రతకు రెగ్యులేషన్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.