Diabetes | న్యూఢిల్లీ : మధుమేహం పట్ల దేశవ్యాప్తంగా సక్రమ రీతిలో వ్యవహరించాలంటే, మరింత సమగ్రంగా పరిశోధనలు జరగాలని శాస్త్రవేత్తలు చెప్పారు. ప్రస్తుతం కొన్ని వర్గాలపై అంతంత మాత్రంగానే పరిశోధనలు జరుగుతున్నట్లు జన్యుపరమైన విశ్లేషణలు వెల్లడించాయన్నారు. ఉదాహరణకు, కార్పొరేట్ ప్రొఫెషనల్స్‌పై జరిగిన పరిశోధన ఫలితాలను ప్రస్తావించారు. హర్యానాలోని ఎన్ఎంసీ జెనెటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పరిశోధన, అభివృద్ధి విభాగాధిపతి వరుణ్ శర్మ మాట్లాడుతూ, తాము తీసుకున్న నమూనాల్లో దాదాపు సగం వరకు ప్రీ-డయబెటిక్ లేదా డయబెటిక్ అని, వారి రక్త పరామితులు అనిశ్చితిగా ఉన్నాయని, అయినప్పటికీ, వారికి ఆ విషయం తెలియదని చెప్పారు.
పర్యావరణం రక్తంలో మరింత ఎక్కువ గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుందని, దీనితో పాటు మరొకటేదో ఉందని ఈ విశ్లేషణ వల్ల తాము ఊహించామని తెలిపారు. అదే జెనెటిక్ ఆర్కిటెక్చర్ అని వివరించారు. ఈ పరిశోధనలో 24-50 సంవత్సరాల మధ్య వయస్కులు 680 మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ రక్త నమూనాలను పరీక్షించారు. వీరిలో 280 మందికిపైగా టైప్ 2 మధుమేహంతో బాధ పడుతున్నట్లు తేలింది. గ్లూకోజ్‌ను క్రమబద్ధీకరించడం, ఊబకాయం వృద్ధి చెందడంలో పాత్ర పోషించే జన్యు వేరియంట్లు ఒత్తిళ్లు, ఆహారం, వ్యాయామం వంటివాటి వల్ల ప్రభావితమవుతున్నట్లు, ఫలితంగా కార్పొరేట్ ప్రొఫెషనల్స్ మధుమేహానికి గురయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.