Diabetes | మనం సులభంగా చేయదగిన వ్యాయామాల్లో నడవడం ఒకటి. నడవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీర బరువు అదుపులో ఉండడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నడవడం వల్ల మనం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. ఇక రోజూ 45 నిమిషాల పాటు నడవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. రోజూ 45 నిమిషాల పాటు మితంగా నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని, డయాబెటిస్ తో బాధపడే వారికి నడక చక్కటి శారీరక వ్యాయామమని వైద్యులు తెలియజేస్తున్నారు.
నడవడం వల్ల కణాలు గ్లూకోజ్ ను సమర్థవంతంగా తీసుకుంటాయని దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడంతో పాటు ఇన్సులిన్ సిగ్నలింగ్ మార్గాలు కూడా మెరుగుపడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. రోజుకు 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గడంతో పాటు జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది. నడవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. కండరాలు రక్తప్రవాహం నుండి గ్లూకోజ్ ను గ్రహించడానికి ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి. శారీరక వ్యాయామం చేయడం వల్ల కండరాలు శక్తి కోసం ఎక్కువ గ్లూకోజ్ ను ఉపయోగించుకుంటాయి. నడవడం వల్ల ఇన్సులిన్ లేకపోయినప్పటికీ గ్లూకోజ్ కణాల్లోకి ప్రవేశిస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. అలాగే రాత్రి భోజనం చేసిన తరువాత 15 నుండి 20 నిమిషాల పాటు నడవడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల చక్కెర స్థాయిల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని వైద్యులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా రోజూ నడవడం వల్ల శరీర బరువు తగ్గుతాయి. పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది. శరీర బరువు తగ్గడం వల్ల గ్లైసెమిక్ నియంత్రణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా నడవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను ప్రోత్సహించే విసెరల్ కొవ్వు కూడా తగ్గుతుంది. నడక వంటి వ్యాయామం చేయడం వల్ల HbA1c ( రక్తంలో చక్కెర స్థాయిల 3 నెలల సగటు) 0.5 శాతం నుండి 1 శాతం వరకు తగ్గుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. డయాబెటిస్ తో బాధపడే వారే కాకుండా ఆరోగ్యవంతులు కూడా రోజూ 45 నిమిషాల పాటు నడవడం వల్ల డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా 45 నిమిషాల పాటు నడవడం వల్ల డయాబెటిస్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు కలుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.