గద్వాల : ఈనెల 17న ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన ( Prajapalana ) దినోత్సవానికి తమను ఆహ్వానించకుండా అవమానం చేశారంటూ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ( Chairman Srinivasulu ) , అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప ( Doddappa ) , బహుజన సామాజిక వర్గం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. స్టేజీ పైకి తమను ఆహ్వానించకుండా అవమానించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సమస్త చైర్మన్ నీలి శ్రీనివాసులు, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడారు. తమను సమావేశానికి ఆహ్వానించి వేదిక పైకి పిలువకపోవడం, కేవలం ఎమ్మెల్యే అనుచరులను మాత్రమే స్టేజీ పైకి పిలిచారని ఆరోపించారు. వేదికపై ఉన్న కలెక్టర్ సంతోష్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడే ఉన్న గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తమను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేతో పాటు తమను అవమానపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. కాగా ప్రజాప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించిన అదనపు కలెక్టర్ సీసీ రాఘవేంద్ర గౌడ్, కేటీ దొడ్డిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మల్లేష్‌ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.