కెరీర్ ఆరంభం నుంచి విభిన్న కథా చిత్రాలు, పాత్రల ద్వారా తనదైన పంథాను సృష్టించుకున్నారు తమిళ అగ్ర హీరో ధనుష్. అయితే కెరీర్లో ఇప్పటివరకు ఆయన పోలీస్ పాత్రను పోషించలేదు. అభిమానులు కూడా ఆయన్ని పోలీస్ క్యారెక్టర్లో చూడాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి అభిలాష ఫలించబోతున్నట్లు తెలిసింది. ధనుష్‌తో ‘సర్’ వంటి బ్లాక్‌బస్టర్ తీసిన దర్శకుడు వెంకీ అట్లూరి ఓ పవర్ఫుల్ పోలీస్స్టోరీని సిద్ధం చేస్తున్నారు. ఇందులో ధనుష్ హీరోగా నటించనున్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను ప్రత్యేకంగా రీసెర్చ్ చేస్తున్నానని, యథార్థ సంఘటనల స్ఫూర్తితో కథ రాస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు దర్శకుడు వెంకీ అట్లూరి. ప్రస్తుతం ధనుష్ తమిళంలో ‘ఓం’ చిత్రాన్ని చేస్తున్నారు. ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత ధనుష్-వెంకీ అట్లూరి సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. ఇదిలావుండగా సూర్య కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్ 14న విడుదలకానుంది.