మేళ్లచెర్వు, మార్చి 2 : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మేళ్లచెర్వులో నిర్వహిస్తున్న జాతరను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రెండో రోజైన బుధవారం సైతం క్యూలైన్లలో బారులు దీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం నిర్వహించి పూలతో అలంకరించారు. దుకాణాలు, పిల్లల వినోద యంత్రాలు, ఎద్దుల పోటీ లు నిర్వహించే ప్రాంతాల్లో భక్తులు కిక్కిరిశారు. భక్తులకు ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ రఘు అన్నదానం కొనసాగిస్తున్నారు.
మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివాలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఇష్టకామేశ్వరీ సహిత స్వయంభూ శంభులింగేశ్వరస్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను ఎదుర్కోళ్ల మహోత్సవం ద్వారా కల్యాణ మండపం వద్దకు చేర్చారు. అనంతరం యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు తదితర ఘట్టాలను మేళతాళాలు, వేదమంత్రాలతో అర్చకులు శాస్ర్తోకంగా నిర్వహించారు. తాసీల్దార్ దామోదర్‌రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి, ఉత్సవకమిటీ చైర్మన్ కమతం సత్యనారాయణ, అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ, భానుకిరణ్శర్మ, శివగోపాలశర్మ పాల్గొన్నారు. జాతర తొలిరోజున దర్శనం, కల్యాణం టికెట్ల ద్వారా రూ.7,01,450 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు.