వరంగల్, జనవరి 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మేడారం-26 మహాజాతర 22 ఏండ్ల క్రితం నాటి జాతరను తలపించిందని భక్తులు గుర్తుచేసుకున్నారు. జాతర చరిత్రలో ట్రాఫిక్ జామ్‌కు 2004 బెంచ్ మార్క్‌గా నిలిచింది. నాటి ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాడ్వాయి నుంచి మేడారం వరకు 14 కిలో మీటర్ల దూరానికి 17 గంటలు ట్రాఫిక్‌లో ఉండిపోయారు. ములుగు, గోవిందరావుపేటకు చెందిన నాయకులు రామకృష్ణ, రవీందర్‌రెడ్డి, కుమారస్వామి, గోపాల్‌రెడ్డి, సాంబశివుడు, గోవింద్‌నాయక్ పస్రా నుంచి ద్విచక్రవాహనాలు వేసుకొని తాడ్వాయికి వచ్చి కేసీఆర్, గాదె , సిరికొండ, యాదగిరిరెడ్డి, మందాడి , రాజయ్యను పస్రాకు తీసుకెళ్లారు.
పస్రాకు చెందిన అనిశెట్టి రామకృష్ణ తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత ద్విచక్రవాహనాలపై తాడ్వాయికి తీసుకురావడంతో మేడారం వెళ్లి తల్లుల దర్శనం చేసుకున్నారు. చిలుకల గుట్ట దగ్గర సమ్మక్క ఆగమనాన్ని తెలియజేసేందుకు ఎస్పీ గాల్లోకి తూటా పేల్చుతారు. నాటి వరంగల్ ఎస్పీ నళిన్‌ప్రభాత్, కలెక్టర్ శివశంకర్ తూటా పేల్చారు. ఇప్పుడు ఎస్పీ సహా 10 మంది ఐపీఎస్‌లు తుపాకీ పేల్చామని చిందులేసినా, జాతరలో మాత్రం భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులను తప్పించలేకపోయారు. నాటి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం నళిన్‌ప్రభాత్ ద్విచక్రవాహనంపై తిరిగి నియంత్రించారని రిటైర్డ్ పోలీసులు గుర్తుచేసుకోవడం గమనార్హం.