– ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు మంజూరి పత్రం అందజేత
– ఆన్లైన్ చేసి ఇంటి నిర్మాణ పనులకు ముగ్గు పోసిన అధికారులు
– నిర్మాణం మొదలుపెట్టిన లబ్ధిదారు జలగం మమత
– బెస్మెంట్ పనులు పూర్తి చేసుకుని బిల్లు కోసం అధికారులను సంప్రదించిన లబ్ధిదారు
– ఐడి నంబర్ తప్పు పడిందని, మీ పేర ఇల్లు మంజూరు కాలేదని చెప్పిన వైనం
తుంగతుర్తి, జూన్ 30 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి చెందిన జలగం మమతకు జూలై 2025లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ చేతుల మీదుగా మంజూరు పత్రం అందజేశారు. అనంతరం అధికారులు ఆన్లైన్ చేసి ఇంటి నిర్మాణానికి ముగ్గు వేయడంతో లబ్ధిదారులు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టి బేస్మెంట్ పనులు పూర్తి చేసింది. మొదటి విడుత బిల్లు కోసం అధికారులను సంప్రదించగా మీ పేరున ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఐడీ నంబర్ తప్పుగా పడిందని మీకు బిల్లు రాదని మీరు పై అధికారులను కలవాలని చెప్పారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తాము కూలి పని చేసుకుని జీవనం సాగిస్తామని, అధికారులు చేసిన పొరపాటు వల్ల తమ కుటుంబం నడి రోడ్డున పడిందని లబ్ధిదారులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే, సూర్యాపేట జిల్లా కలెక్టర్ స్పందించి తప్పు చేసిన అధికారులపై చర్య తీసుకుని తమకు ఇల్లు మంజూరు చేసి న్యాయం చేయాలని వేడుకున్నారు.