బొంబాయి- దుబాయి-బొగ్గుబాయి.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బతుకు ఇదే. రాష్ట్రం ఆవిర్భవించాక వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కళకళలాడినయ్. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మన పొలాల్లో పనుల కోసం ఉత్తరాది నుంచి వచ్చిన వలసకూలీలెందరో! పదేండ్లు రాజసంగా బతికిన తెలంగాణ పల్లెల్లో మళ్లీ ఇప్పుడు వలసల వలపోత మొదలైంది. ఉపాధి లేక, పంటలు పండక, అప్పులపాలై యువత గల్ఫ్ బాట పడుతున్నది. ధైర్యం సడలి, బతుకుదెరువు కోసం ఎడారి దేశాలవైపు చూస్తున్న మల్యాల బాబు లాంటి వాళ్లు ఎందరో!
Telangana | ఎల్లారెడ్డిపేట, మార్చి 3 : ఏ వలసల నివారణకు కాంగ్రెస్‌తో తలపడి తెలంగాణను తెచ్చుకున్నమో.. అదే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పుణ్యమా అని ఇప్పుడు మళ్లీ పరాయి దేశాలకు పొట్టచేతబట్టుకుంటూ యువకుల వలసబాటలు పడుతున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవుసం పండుగలా మారి.. అన్ని రంగాలూ కళకళలాడి.. నాలుగు పైసలు సంపాదించుకొనే పరిస్థితి ఉంటే.. నేడు ఎక్కడా ఉపాధి లేక యువత మళ్లీ దిక్కులు చూడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ‘చెయ్యి’చ్చిన పార్టీ పాలనలో నిరుద్యోగుల్లో ఆశలు సన్నగిల్లాయి. కనీసం పంటలు పండిద్దామన్నా కృత్రిమ కరువు తరుముకొచ్చింది. ఎమ్మెస్సీ, బీఈడీ చేసి.. అటు ఉద్యోగం రాక.. ఇటు ఎవుసం చేసే దారిలేక సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ యు వకుడు భవిష్యత్తుపై భరోసా కరువై కన్నీళ్లు పెట్టుకుంటూ గల్ఫ్ బాట పట్టడం నేటి ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతున్నది.
‘తెలంగాణ వచ్చినంక ఏ పనిజేసినా ఈడనే బతుకుతమనే ధైర్యముండె.. ఇప్పుడు చేద్దామంటే ఎవుసానికి భరోసాలేదు.. పంటకు సాగునీళ్లు వస్తలేవు.. చదువుకున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు రావు.. ప్రైవేట్‌లో జీతాలు సాలవు.. వచ్చే నాలుగేండ్లు ఏంజేసినా లాభంలేదనిపిస్తుందే అవ్వా.. బయటకు పోతున్నా ఇల్లు పైలం.. చెల్లే.. పోయస్తనే’ అంటూ ఓ యువకుడు గల్ఫ్ బాటపట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలకు చెందిన మల్యాల బాబు ఉన్న ఊరును, కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, కన్న కొడుకును వదిలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉపాధి కోసం సోమవారం దుబాయ్‌కి పయనమయ్యాడు. ఎమ్మెస్సీ, బీఈడీ చదివిన బాబు పొలం పనులతో పాటు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. చిన్నతనంలో తండ్రి బాలయ్య గల్ఫ్ వెళ్లి 20 ఏండ్లు గడిపాడు. 14 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి ఇంటి వద్దే ఉండిపోయాడు. బాబు గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లలో దరఖాస్తు చేసి కొద్దిలో జాబ్ మిస్ అయ్యాడు.
ఏడాదిలో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇటీవల రూ.2.5 లక్షలు పెట్టుబడి పెట్టి మూడెకరాలు పత్తి వేస్తే రూ.లక్ష వరకు పెట్టుబడి మీదపడ్డది. వరి వేద్దామనుకుంటే బావిలో నీళ్లు అడుగంటిపోయాయి. ప్రైవేట్ పాఠశాలలో చాలీచాలని జీతాలు.. కండ్లముందు చెల్లి పెండ్లి.. ఇతర అవసరాల కోసం చేసిన అప్పు తీర్చే మార్గం కనిపించడం లేదని చలించిపోయాడు. బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పడితేనే వీటన్నింటికీ పరిష్కారం ఉంటుందని వాపోయాడు. ‘ఇక పోయస్తా’ అంటూ గుండె నిండా బా ధతో సోమవారం దుబాయ్ బయలుదేరాడు. ‘అవ్వా ఇల్లు పైలం.. అంటూ తల్లి లక్ష్మికి, చెల్లే.. జాగ్రత్త అంటూ సోదరి రేఖకు, ఇంటిపై ఓ కన్నుంచు.. అంటూ బావకు, ఏడాది కొ డుకు మహాన్ష్ను ఎత్తుకుని.. ‘నాన్నా టాటా’ అంటూ బస్సెక్కాడు. కొనితెచ్చుకున్న నవ్వుకు ప్రయత్నించినా అతడిలో కంటతడి కనిపిస్తూనే ఉన్నది. బస్సెక్కి అందరికీ కంటతడి పెట్టి వీడ్కోలు పలికిన తీరు కుటుంబ సభ్యుల్లో ఒకింత బాధను నింపింది.