జోహెన్నస్‌బర్గ్, డిసెంబర్ 26: దక్షిణాఫ్రికాలో జాతివివక్షపై అవిశ్రాంత పోరాటం చేసిన ఎల్జీబీటీల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్‌బిషప్ డెస్మండ్ టుటు(90) ఆదివారం కన్నుమూశారు. కేప్‌టౌన్‌లో తెల్లవారుజాము సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్టు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోసా వెల్లడించారు. దక్షిణాఫ్రికా విముక్తి కోసం పోరాడిన వారిలో మరో మహోన్నత వ్యక్తిని కోల్పోయామని పేర్కొన్నాడు.
వర్ణవివక్ష శక్తులకు వ్యతిరేకంగా పోరాడటంతో పాటు అణచివేత, అన్యాయం, హింసకు గురైన బలహీనవర్గాల ప్రజలకు అండగా ఉన్నారని పేర్కొన్నారు. 1984లో డెస్మండ్ టుటు నోబెల్ బహుమతి పొందారు. గతంలో క్షయ వ్యాధి నుంచి బయటపడిన టుటు.. 1997లో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. టుటు మృతిపై ప్రధాని మోదీ తదితరులు సంతాపం తెలిపారు.