బొడ్రాయిబజార్, జూన్ 14 : సూర్యాపేటలో బీఆర్ఎస్ జిల్లా నేతకు చెందిన హోటల్‌ను అధికారులు రాత్రికి రాత్రి కూల్చివేశారు. సూర్యాపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు గండూరి ప్రకాశ్‌కు పట్టణంలోని మినీ ట్యాంక్‌బండ్‌పై జాజు హోటల్ ఉన్నది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బంది, 30 మంది వరకు పోలీసులతో వచ్చి జేసీబీ సాయంతో ఆ హోటల్‌ను కూల్చివేశారు. హోటల్లో పనివాళ్లు నిద్రపోతున్నారని కూడా చూడకుండా కూల్చివేత మొదలుపెట్టారు. చీకట్లో పెద్దపెద్ద శబ్దాలు రావడంతో చుట్టుపక్కల ప్రజలు కూడా ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు గురయ్యారు. జాజు హోటల్‌కు అనుమతి లేదని యజమాని గండూరి ప్రకాశ్‌కు నోటీసులు పంపించినట్టు అధికారులు చెబుతుండగా, అనుమతి ఉందంటూ కోర్టు నుంచి స్టే తెచ్చినప్పటికీ అధికారులు కక్షకట్టి హోటల్‌ను కూల్చివేశారని నిర్వాహకులు వాపోతున్నారు. ఘటన గురించి తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు హోటల్ వద్దకు చేరుకొని పరిశీలించారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని, పదేండ్లు ప్రశాంతంగా ఉన్న సూర్యాపేటలో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయని మండిపడ్డారు. హోటల్ కేవలం బీఆర్ఎస్ నాయకుడిదన్న కారణంగా కూల్చారని వారు ఆరోపించారు. ఉద్యోగులు మున్సిపల్ చైర్‌పర్సన్‌కు కనీస సమాచారం ఇవ్వకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదని హెచ్చరించారు. ఇటీవల బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రామ్మూర్తి ఇంటి ర్యాంప్‌ను కూల్చడం, ఇప్పుడు ప్రకాశ్ హోటల్‌ను కూల్చడం ఉద్దేశపూర్వకంగా చేసిందేనని స్పష్టమవుతున్నదని తెలిపారు.