న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని రాజ్యసభ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగం భారీస్థాయిలో ఉన్న సమయంలో పోస్టులను ఖాళీగా పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వ డిపార్ట్మెంటుల్లో 8 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భద్రతా దళాల్లో లక్ష, రైల్వేశాఖలో రెండు లక్షల పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాల ఖాళీ అంశాన్ని వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మంగళవారం సభలో జీరోఅవర్ సందర్భంగా లేవనెత్తారు. సీపీఎం ఎంపీ వి సదాశివన్ మాట్లాడుతూ పలు మంత్రిత్వశాఖలు ఇచ్చిన సమాచారం మేరకు భద్రతా దళాల్లో 1,25,555, రైల్వేలో 2,65,547, గెజిటెడ్ పోస్టులు 80,752 ఖాళీగా ఉన్నాయని, వీటితో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది డిసెంబర్ నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతం ఉన్నదని, యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం తక్షణం చర్యలు తీసుకోవాలని ఎల్జేడీ ఎంపీ శ్రేయామ్స్ కోరారు.
అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో కాంగ్రెస్: ప్రధాని మోదీ
రాజ్యసభ వేదికగా కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో కాంగ్రెస్ ఉన్నదని, అందుకే దాని ఆలోచనలు ప్రతికూలంగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను చెప్పుకొచ్చిన ఆయన ఇదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారసత్వ పార్టీలు భారత ప్రజాస్వామ్యానికి పెద్దముప్పుగా మోదీ వర్ణించారు. భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే ఊహించిన మహాత్మాగాంధీ కూడా కాంగ్రెస్ ఉండకూడదని, ఆ పార్టీని రద్దు కూడా చేయాలని అనుకున్నారని చెప్పారు.
కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గేను ప్రస్తావిస్తూ మోదీ మాట్లాడుతూ ‘కాంగ్రెస్ లేకపోతే ఏం జరిగేదో తెలుసా? అని కొంత మంది అడుగుతున్నారు. అసలు కాంగ్రెస్సే లేకపోతే ఎమర్జెన్సీ ఉండేది కాదు, సిక్కుల ఊచకోత జరిగేది కాదు’ అని పేర్కొన్నారు. అదేవిధంగా కులతత్వ రాజకీయాలు, కశ్మీర్ పండిట్ల సమస్యలు అసలు వచ్చేవే కావని అన్నారు. గాంధీజీ కోరుకున్నది గనుక జరిగివుంటే వారసత్వ రాజకీయాలు లేని ప్రజాస్వామ్యం ఉండేదని, అవినీతి వ్యవస్థాపితం అయ్యేది కాదని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ కారణంగా దేశ పౌరులు నీరు, విద్యుత్, రోడ్డు వంటి కనీస మౌలిక సదుపాయాల కోసం ఏండ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని విమర్శించారు. మోదీ ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.