రాజాపేట, అక్టోబర్ 16: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. ఇదే ఆసరాగా చేసుకొని రాజాపేట మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరందుకుంది. కొందరు అక్రమారులు డంపులు వేసి రవాణా చేస్తుండగా..మరికొందరు అనుమతుల ముసుగులో పకదారి పట్టిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలకు తావిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరిట అనుమతి పొందిన వారికి సకాలంలో ఇసుక సరఫరా చేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
మండలంలోని బేగంపేట, రఘునాధపురం, దూదివెంకటాపురం వాగుల్లో నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరిట 4 ట్రిప్పులకు అనుమతి తీసుకొని 10 నుంచి 15 ట్రాక్టర్ల ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక సరఫరా దేవుడెరుగు గానీ, అక్రమ రవాణా మాత్రం జోరుగా సాగుతోంది. మరికొంతమంది రాత్రి వేళల్లో అడ్డూఅదుపు లేకుండా అక్రమ రవాణాను దర్జాగా సాగిస్తున్నారు.
పోలీసులు కేసులు నమోదు చేస్తున్నప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. ఇందిరమ్మ ఇండ్ల పనులు కొనసాగనప్పటికీ ట్రాక్టర్లతో వందల ట్రిప్పుల ఇసుక ఇతర కాలనీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని మండలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకొని అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.