హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ప్రత్యేకించి ఎగుమతుల రంగంలో రాష్ట్రం శరవేగంగా ముందుకు సాగుతున్నది. మన ఎగుమతులకు ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో ఎనలేని గిరాకీ ఉండటమే ఇందుకు కారణం. తెలంగాణ నుంచి ఎక్కువగా దిగుమతులు చేసుకొంటున్న రాష్ర్టాల్లో అమెరికా, చైనా, రష్యా తొలి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎగుమతుల ద్వారా రాష్ర్టానికి గణనీయంగా ఆదాయం రావడమే కాకుండా ఉద్యోగావకాశాలు కూడా మెరుగవుతున్నాయి. తెలంగాణ ఆర్థిక, సామాజిక నివేదిక-2022 ప్రకారం.. రాష్ర్టానికి ఆదాయం, పెట్టుబడుల రాక, ఉపాధి కల్పనలో ఎగుమతులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. 2020-21లో రాష్ట్రం నుంచి రూ.2,10,081 కోట్ల విలువైన సరుకులు, సేవల ఎగుమతులు జరిగాయి. ఇది రాష్ట్ర జీఎస్డీపీలో 21.4 శాతానికి సమానం. విలువ ఆధారంగా చూస్తే రాష్ట్ర ఎగుమతుల్లో 69.3 శాతం వాటా సేవల రంగానిదే. నీతి ఆయోగ్ ఎగుమతుల సన్నద్ధత సూచిక-2020 ప్రకారం.. దేశం నుంచి అత్యధిక ఎగుమతులు జరుపుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ 4వ స్థానంలో, ల్యాండ్లాక్డ్ రాష్ర్టాల జాబితాలో రెండవ స్థానంలో, ఎగుమతులకు సంబంధించి అత్యంత మెరుగైన ఎకో సిస్టమ్‌ను కలిగిన రాష్ర్టాల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ఎగుమతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, వాణిజ్య మద్దతు వ్యవస్థ, పరిశోధన-అభివృద్ధి (ఆర్అండ్డీ)కి అవసరమైన మౌలిక వసతులు ఉన్నట్టు ఆ నివేదిక తేల్చింది. ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించడం, ఇంటర్నెట్ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చడం, నిధుల లభ్యతను పెంపొందించడం, పరిశోధనా సంస్థల ఏర్పాటు తదితర చర్యల ద్వారా తెలంగాణ ఎగుమతులను పెంచుకొనేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నీతి ఆయోగ్ పేర్కొన్నది.
2020-21లో తెలంగాణ రూ.64,539.42 కోట్ల విలువైన సరుకులను ఎగుమతి చేసింది. వీటిలో ఔషధాలు, ఆర్గానిక్ కెమికల్స్ వాటా 65 శాతంగా ఉన్నది. గతేడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య తెలంగాణ నుంచి జరిగిన ఎగుమతుల్లో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా.. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర మొత్తం ఎగుమతుల్లో 75% వాటా ఈ ఐదు జిల్లాలదే.
భారత్‌లో వాణిజ్యానికి అత్యంత ప్రభావవంతమైన గమ్యస్థానంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచినట్టు 2019-20 నివేదికలో ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. ఎగుమతులకు అత్యంత అనువైన ఎకో సిస్టమ్‌ను సృష్టించుకోవడం ద్వారా తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. తయారీ రంగం అభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్నది. స్వరాష్ట్రంలో టీఎస్ ఐపాస్ చట్టంతోపాటు ప్లగ్ అండ్ ప్లే సదుపాయంతో కూడిన నూతన పారిశ్రామికవాడల ఏర్పాటు, అంతర్జాతీయ పోటీని తట్టుకొనేలా పెట్టుబడిదారులకు రాయితీలు, నైపుణ్యం గల మానవవనరుల అభివృద్ధి తదితర చర్యల ద్వారా పారిశ్రామిక రంగానికి దన్నుగా నిలుస్తున్నది. అంతర్జాతీయంగా గిరాకీ ఉన్న ఆహార శుద్ధి, వస్త్ర పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది.