హైదరాబాద్, అక్టోబర్23 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్టు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్రంలోని ప్రభుత్వాలు 76 ఏండ్లుగా బీసీలను అన్యాయానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కులగణన కోసం ఇప్పటికే అనేకసార్లు ఆందోళనలు నిర్వహించామని, అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని, దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, చలో ఢిల్లీ కార్యక్రమంలో ప్రతీ బీసీ పాల్గొనాలని పిలుపునిచ్చారు.