ధర్మశాల: తొలి ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన తర్వాత అనూహ్యంగా తడబడుతున్న పంజాబ్ కింగ్స్ వరుసగా నాలుగో ఓటమి మూటగట్టుకుంది. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం అందుకుంది. భారీ లక్ష్య ఛేదనలో టాపార్డర్ తడబడినా కెప్టెన్ అక్షర్ పటేల్ (30 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 56), డేవిడ్ మిల్లర్ (28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51) ఖతర్నాక్ ఆటతో విజృంభించడంతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో డీసీ 3 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించి ఐదో విజయం ఖాతాలో వేసుకుంది.
ప్రత్యర్థి ఇచ్చిన 211 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి మరో 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ 20 ఓవర్లలో 210/5 స్కోరు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 నాటౌట్), ప్రియాంశ్ ఆర్య (33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56) అర్ధ శతకాలతో రాణించారు. మాధవ్ తివారి, మిచెల్ స్టార్క్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఓపెనింగ్‌లో ప్రియాంశ్.. తర్వాత శ్రేయస్ దూకుడుగా ఆటడంతో పంజాబ్ భారీ స్కోరు చేసింది. పవర్ ప్లేలో ప్రియాంశ్ పవర్ ఫుల్ షాట్లతో సిక్సర్ల వర్షం కురిపించాడు. మిచెల్ స్టార్క్‌కు రెండు సిక్సర్లతో స్వాగతం పలికిన అతను ఎంగిడి బౌలింగ్‌లో ఆర్య 6,6,4 కొట్టడంతో మూడు ఓవర్లకే స్కోరు 50 దాటింది. అదే జోరుతో అతను 24 బంతుల్లోనే లీగ్‌లో ఐదో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా పవర్ ప్లేను కింగ్స్ 72/0తో ముగించింది. అంత ధాటిగా ఆడలేకపోయిన మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ (18)ను ఏడో ఓవర్లో ముకేశ్ కుమార్ వెనక్కుపంపి ఢిల్లీకి తొలి బ్రేక్ ఇచ్చాడు. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ ఆకిబ్ నబీ బౌలింగ్‌లో వరుస ఫోర్లతో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. కొత్త పేసర్ మాధవ్ తివరి బౌలింగ్‌లో ఆర్య.. సాహిల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైనా.. కూపర్ కనోలి (38) తోడుగా శ్రేయస్ రన్‌రేట్ తగ్గకుండా చూసుకున్నాడు.
మంచి షాట్లతో ఫోర్లు, సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఏమాత్రం కుదురుకోనివ్వలేదు. మాధవ్ బౌలింగ్‌లో ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో అతనికి సహకారం అందించిన కనోలి .. స్టార్క్ బౌలింగ్‌లో భారీ సిక్స్, ఎంగిడి ఓవర్లో 4,6 కొట్టిన తర్వాత మాధవ్‌కు వికెట్ ఇచ్చుకున్నాడు. 19వ ఓవర్ తొలి రెండు బంతులకు స్టోయినిస్ (1), శశాంక్ సింగ్ (0)ను పెవిలియన్ చేర్చిన స్టార్క్ హ్యాట్రిక్‌పై నిలిచాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యాన్ష్ షెడ్గే (24 నాటౌట్) అదే ఓవర్లో 6, 4, 6తో స్టేడియాన్ని హోరెత్తించాడు. చివరి ఓవర్ తొలి ఐదు బంతుల్లో ఎంగిడి 3 రన్స్ మాత్రమే ఇచ్చినా.. ఆఖరి బాల్‌కు ఫోర్ కొట్టిన షెడ్గే ఇన్నింగ్స్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
టాపార్డర్ చేతులెత్తేయడంతో భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఘోరంగా తడబడినా సీనియర్లు అక్షర్, మిల్లర్ ఆ జట్టును ఒడ్డుకు చేర్చారు. కొత్త బంతితో యశ్ ఠాకూర్, అర్ష్‌దీప్ ఆరంభంలోనే ఢిల్లీని దెబ్బకొట్టారు. రెండో ఓవర్లోనే అభిషేక్ పోరెల్ (5)ను యశ్ బౌల్డ్ చేయగా.. తన వరుస ఓవర్లలో కేఎల్ రాహుల్ (9), సాహిల్ పరాఖ్ (13)ను పెవిలియన్ చేర్చి అర్ష్‌దీప్ ఢిల్లీని 33/3తో నిలిపాడు. ఈ దశలో కెప్టెన్ అక్షర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నా.. క్రీజులో ఇబ్బందిపడ్డ ట్రిస్టన్ సబ్స్ (12) తొమ్మిదో ఓవర్లో రనౌటయ్యాడు. దాంతో 74/4తో నిలిచిన ఢిల్లీ పోరాటం త్వరగానే ముగిసేలా కనిపించింది.
కానీ, కెప్టెన్ అక్షర్, డేవిడ్ మిల్లర్ అనూహ్యంగా ఎదురుదాడికి దిగారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. స్టోయినిస్ వేసిన 14వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన అక్షర్ 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో డీసీ ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. తర్వాతి బాల్కే అక్షర్‌ను ఔట్ చేసిన స్టోయినిస్ ఐదో వికెట్‌కు 64 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని ముగించాడు. 15వ ఓవర్లో అర్ష్‌దీప్ 5 రన్స్ మాత్రమే ఇవ్వడంతో పంజాబ్‌కే మొగ్గు కరిపించింది.
అయినా పోరాటం వదలని మిల్లర్.. యాన్సెన్ బౌలింగ్‌లో 4,6.. డ్వార్షుయిస్ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో 27 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకొని తర్వాతి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇక, చివరి మూడు ఓవర్లలో డీసీకి 36 పరుగులు అవసరం అవగా అశుతోష్ (24) గెలుపు బాధ్యత తీసుకున్నాడు. స్టోయినిస్ బౌలింగ్‌లో అశుతోష్ 4,6.. మాధవ్ (18 నాటౌట్) సిక్స్ కొట్టి జట్టును రేసులో నిలిపారు. ఆపై యశ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి అశుతోష్ ఔటైనా.. ఆకిబ్ నబీ (10 నాటౌట్) వరుసగా 4,6తో మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్ ముగించాడు.
పంజాబ్ కింగ్స్ :20 ఓవర్లలో 210/5 (శ్రేయస్ 59, ఆర్య 56, మాధవ్ తివారి 2/40, స్టార్క్ 2/57);
ఢిల్లీ : 19 ఓవర్లలో 216/7 (అక్షర్ 56, మిల్లర్ 51, అర్ష్‌దీప్ 2/21)
