వడోదర : మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆఖరిదాకా ఉత్కంఠ రేపిన మూడో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆదివారం ఇక్కడ యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ.. 5 వికెట్ల తేడాతో గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. స్వల్ప ఛేదనలో క్యాపిటల్స్ తడబడినా మధ్య ఓవర్లలో లారా వోల్వార్ట్ (47) ఆఖర్లో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ (18 బంతుల్లో 34*, 5 ఫోర్లు) సంయమనంతో ఆడి ఆ జట్టును విజయతీరాలకు చేర్చారు.
లక్ష్యాన్ని ఢిల్లీ 18.4 ఓవర్లలో పూర్తిచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. 20 ఓవర్లకు 122/8కే పరిమితమైంది. దీప్తి శర్మ (24) టాప్ స్కోరర్ కాగా ఆల్‌రౌండర్ శిఖా పాండే (23*) ఫర్వాలేదనిపించింది. ఢిల్లీ విజయంతో వారియర్స్‌తో పాటు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా లీగ్ దశలోనే ఇంటిబాట పట్టాయి. మంగళవారం జరుగబోయే ఎలిమినేటర్‌లో ఢిల్లీ.. గుజరాత్‌ను ఢీకొననుంది.