మెల్బోర్న్ : స్పెయిన్ నయాబుల్ కార్లోస్ అల్కరాజ్ కొత్త చరిత్ర లిఖించాడు. టెన్నిస్‌పై తనదైన ముద్రవేస్తూ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దుమ్మురేపాడు. కెరీర్లో తనను ఊరిస్తున్న ఆస్ట్రేలియన్ టైటిల్‌ను మొదటిసారి సగర్వంగా ముద్దాడాడు. ప్రియమైన ప్రత్యర్థి సెర్బియా టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్పై అద్భుత విజయం సాధించాడు. ఆదివారం కిక్కిరిసిన వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన టైటిల్ పోరులో అల్కరాజ్ 2-6, 6-2, 6-3, 7-5తో జొకోవిచ్‌ను మట్టికరిపించాడు. ఈ క్రమంలో పిన్న వయసు(22 ఏండ్ల 272 రోజులు)లో కెరీర్ స్లామ్ పూర్తి చేసుకున్న ప్లేయర్‌గా అల్కరాజ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు కైవసం చేసుకున్న అల్కరాజ్..మరోమారు జొకోవిచ్ రికార్డు టైటిల్స్‌పై నీళ్లు గుమ్మరించాడు. రికార్డు స్థాయిలో 10 సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన 38 ఏండ్ల జొకోవిచ్.. 25 టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తూనే ఉన్నాడు.
ఈసారైనా మార్గరెట్ కోర్టు(24) రికార్డును అధిగమిద్దామనుకున్న జొకో ఆశలను అల్కరాజ్ వమ్ముచేశాడు. మ్యాచ్ విషయానికొస్తే అల్కరాజ్, జొకోవిచ్ మధ్య తుది పోరు అభిమానులను అలరించింది. ఓపెన్ ఎరాలో తనదైన ముద్రవేసిన అనుభవజ్ఞుడైన జొకోవిచ్ ఓవైపు అయితే మరోమారు 22 ఏండ్ల వయసులో సంచనాలు సృష్టిస్తున్న కార్లోస్ మరోవైపు సై అంటే సై అన్నట్లు పోటీపడ్డారు. సెమీఫైనల్లో ఇటలీ యువ సంచలనం జానిక్ సిన్నర్ ఓడించిన జోష్‌లో ఫైనల్లోకి అడుగుపెట్టిన జొకో..అదే ఊపులో తొలి సెట్‌ను 6-2తో కైవసం చేసుకున్నాడు. అల్కరాజ్ కోర్టులో కుదురుకోకముందే తనదైన శైలిలో తొలి సెట్ గెలిచి శుభారంభం చేశాడు. అయితే ఎప్పటిలాగే ప్రత్యర్థికి తొలి సెట్ కోల్పోయి అద్భుతంగా పుంజుకునే అల్కరాజ్ వరుసగా మూడు సెట్లలో జొకోవిచ్‌కు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగాడు. మ్యాచ్‌లో టాప్‌సీడ్ అల్కరాజ్ 9 ఏస్‌లు సంధిస్తే..జొకోవిచ్ నాల్గింటికి పరిమితమయ్యాడు.
16 బ్రేక్ పాయింట్లలో అల్కరాజ్ ఐదింటిని కైవసం చేసుకుంటే జొకో ఆరింటిలో రెండింటితో సరిపెట్టుకున్నాడు. సెట్ సెట్‌కు తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయిన అల్కరాజ్ 21 గేములు గెలిస్తే..జొకో 16 ఖాతాలో వేసుకున్నాడు. తొలి సెట్‌ను అలవోకగా దక్కించుకున్న జొకోవిచ్ రెండో సెట్ నుంచి పట్టుతప్పాడు. రెండో సెట్లో 1-1తో ఉన్న సమయంలో జొకో కొట్టిన షాట్లు అల్కరాజ్ను అడ్డుకోలేకపోయాయి. ఇదే అదనుగా ఐదింటిలో నాలుగు కైవసం చేసుకుని పోటీలోకి వచ్చాడు. మూడో సెట్ నుంచి అల్కరాజ్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. అదే జోష్‌తో 6-3తో మూడో సెట్ గెలిచిన ఈ యువ సంచలనం..నాలుగో సెట్లో ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో జొకోను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఏకాగ్రత కోల్పోకుండా జొకోపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా మూడో సెట్ గెలిచిన అల్కరాజ్ ఒక్కసారిగా కోర్టులో తనదైన శైలిలో పడుకుని అద్భుత విజయాన్ని ఆస్వాదించాడు. స్టాండ్స్‌లో ఉన్న తన అభిమాన ఆటగాడు రఫెల్ నాదల్కు అభివాదం చేస్తూ కోచింగ్ బృందంతో కలిసి అల్కరాజ్ గెలుపు సంబురాలు చేసుకున్నాడు.