నల్లగొండ విద్యావిభాగం (రామగిరి), మే12 : తెలంగాణ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్షలను బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం విధితమే. అయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకు సానుకూల స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీనిలో భాగంగా నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి యూనివర్సిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులు గతంలో తీసుకున్న పాత హాల్ టికెట్ తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారు. డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలతో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణపై ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు సోమవారం సాయంత్రం ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి.ఉపేందర్‌రెడ్డి సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణను వివరించారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలుంటే యూనివర్సిటీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
– ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఎంజీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో 14, సూర్యాపేట జిల్లాలో 10, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
– రెండో సెమిస్టర్లో 1,04,008 మంది విద్యార్థులు,. నాలుగో సెమిస్టర్ లో 8,660, ఆరో సెమిస్టర్ కు 4,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.
– ఒకటో సెమిస్టర్ కు 66, మూడో సెమిస్టర్ లో 519, ఐదో సెమిస్టర్ కు 4,171 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
– గతంలో తీసుకున్న హాల్ టికెట్ లేదా ప్రస్తుతం తీసుకున్న నూతన హాల్ టికెట్ తో హాజరు కావచ్చు.
– కళాశాల ఐడి కార్డు తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్ వెంట తీసుకు రావాలి.
– ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు.
ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కళాశాలలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి ఇచ్చిన హామీ మేరకు, విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహణకు అంగీకరించినట్లు తెలంగాణ అప్లియేటెడ్ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల అసోసియేషన్ అధ్యక్షుడు మారం నాగేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి కళాశాలలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయన్నారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను త్వరగా విడుదల చేసి ప్రైవేట్ కళాశాల యజమాన్యాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.