హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు జారీచేసింది. తమ వాదనలతో నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ తరువాత వారం రోజుల్లోగా పిటిషనర్లు వాటికి సమాధానమిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశించింది. బీఆర్ఎస్ నుంచి గెలుపొంది అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు టీ ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి, ఎం సంజయ్‌కుమార్‌లకు నోటీసులు పంపింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరిస్తూ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జీ జగదీశ్‌రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. దానం నాగేందర్‌పై బీజేపీ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేరొక పిటిషన్ దాఖలు చేశారు.
వీటిపై తదుపరి విచారణను ధర్మాసనం జూన్ 25కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన తొమ్మిది వేర్వేరు పిటిషన్లసై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోకి తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టు అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదని చెప్పారు. ఫిరాయింపుదారులపై వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పులను సమర్పించినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఏకపక్షంగా అనర్హత పిటిషన్లను కొట్టేయడం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారని, మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన కుమార్తెకు ఎంపీ టికెట్ దకించుకుని బహిరంగంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారని, ఇంకో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్యాబినెట్ హోదాలోని పదవిలో ఉన్నారని చెప్పారు. వారంతా పీసీసీ చీఫ్, సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆ పార్టీ కండువా కప్పుకొన్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయని, టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం అయ్యిందని చెప్పారు. దానం పార్టీ ఫిరాయించారని చెప్పడానికి సాక్ష్యం కూడా అవసరం లేదని అన్నారు. వాదనల తరువాత ధర్మాసనం, ప్రతివాదులు కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.