‘స్పిరిట్’ ‘కల్కి-2’ చిత్రాల నుంచి దీపికా పడుకోన్ తొలగింపు వ్యవహారం భారతీయ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కొద్దిమాసాల వ్యవధిలో భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి ఈ భామ నిష్క్రమణం ఆమె అభిమానులను కలవరపెట్టింది. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు నేరుగా స్పందించలేదు దీపికా పడుకోన్. తన సోషల్‌మీడియా ద్వారా పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఈ భామ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఐఎమ్‌డీబీ సంస్థ ‘25ఏళ్ల భారతీయ సినిమా’ అనే అంశంపై ఓ నివేదికను విడుదల చేసింది. 130 చిత్రాలను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేయగా.. ఆ జాబితాలోని 10 చిత్రాల్లో దీపికా పడుకోన్ కథానాయికగా నటించడం విశేషం.
ఈ నేపథ్యంలో అమితాబ్‌బచ్చన్, రణబీర్‌కపూర్, సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్, అలియాభట్, ప్రభాస్ వంటి అగ్ర తారలను వెనక్కినెట్టి ముందువరుసలో నిలిచింది దీపికా పడుకోన్. ఈ రికార్డును సొంతం చేసుకోవడంపై ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కల్కి-2’ వ్యవహారంపై పరోక్ష వ్యాఖ్యలు చేసింది. కెరీర్ తొలిరోజుల్లోనే ఇండస్ట్రీలో ఎలా నెగ్గుకురావాలనే విషయంలో తనకు స్పష్టత ఉందని చెప్పిది. ‘నేను ముక్కుసూటిగా ఉంటాను. నమ్మిన విలువలను ఏరోజూ వదులుకోను. నాకు తప్పనిపిస్తే ఎంతటివారినైనా ప్రశ్నించడం మానుకోను. అది నా నైజం. అవసరమైతే కష్టాల దారినే ఎంచుకుంటాను కానీ ఎవరికీ తలవంచను’ అని దీపికా పడుకోన్ చెప్పింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.