గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్. తాను నిర్మించి, నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా తాలూకు డిజిటల్ రైట్స్‌ను విక్రయించకుండా యూట్యూబ్‌లో వే పర్ వ్యూ పద్దతిలో స్ట్రీమింగ్కు పెట్టారు అమీర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ స్ట్రీమింగ్కు మధ్య కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండాలని చెప్పారు. అమీర్‌ఖాన్ మాటలపై అక్షయ్‌కుమార్ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు. ఓటీటీ సంస్థలు నిర్మాతలకు భారీ మొత్తంలో డిజిటల్ రైట్స్ కోసం చెల్లిస్తున్నాయని, అలాంటప్పుడు వారు లాభాలు ఆశించడంలో తప్పేమిటని ప్రశ్నించారు. ‘నా దృష్టిలో మూడు నెలల గ్యాప్ సరిపోతుంది.
అంతకుమించి ఎక్కువైతే ఓటీటీ సంస్థలు నష్టపోతాయి. ఇండస్ట్రీలో కొన్ని వాదనలు విచిత్రంగా ఉంటాయి. ఓటీటీ సంస్థల నుంచి డిజిటల్ హక్కుల కోసం భారీ మొత్తంలో స్వీకరిస్తారు. ఒకవేళ సినిమా ఆడకపోతే ఓటీటీల వల్లే ఆడటం లేదని విమర్శిస్తారు. ఇవి ద్వంద్వప్రమాణాలు. మంచి కంటెంట్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఇండస్ట్రీలో కరోనాకు పూర్వం పరిస్థితులు రావాలి. ఆ రోజుల్లో సినిమా, ఓటీటీ మాధ్యమాలు చక్కటి అవగాహనతో పనిచేశాయి. ఓటీటీ వల్ల తాము నష్టపోయామని అప్పుడు ఏ నిర్మాత చెప్పలేదు’ అని అక్షయ్‌కుమార్ పేర్కొన్నారు. అమీర్‌ఖాన్‌కు కౌంటర్‌గానే అక్షయ్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారని బాలీవుడ్ వర్గాలంటున్నాయి.