Deeksha Divas | గ్రేటర్‌వ్యాప్తంగా శుక్రవారం దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిం చేందుకు గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. నియోజక వర్గాల వారీగా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు నిమ్స్ వైద్యశాలలో 2వేల మందికి పండ్లు పంపిణీ చేయనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, దీక్షా దివస్ హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి పొన్నాల లక్ష్మయ్య, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేయనున్నారు. అలాగే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2వేల మంది తరలిరానుండగా, బైక్‌లపై ర్యాలీగా బసవతారకం దవాఖాన సర్కిల్ వరకు చేరుకొని.. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పాదయాత్రగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తలసాని పిలుపునిచ్చారు. – సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ):
కేసీఆర్ త్యాగ ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం..
ఎన్నో త్యాగాల పునాదులపై బీఆర్ఎస్ జెండా ఎగిరింది. కేసీఆర్ చేసిన త్యాగ ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కంటోన్మెంట్లో చేపట్టే దీక్షా దివస్‌ను శ్రేణులు విజయవంతం చేయాలి.
– టీఎన్ శ్రీనివాస్, మాజీ చైర్మన్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ
తెలంగాణ మలిదశ పోరాటానికి..
తెలంగాణ మలిదశ పోరాటానికి కేసీఆర్ చేపట్టిన దీక్షే కారణం. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షకు పూనుకున్నారు. దీక్షాదివస్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు తరలిరావాలి.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు
ఉద్యమంలో కంటోన్మెంట్ది ప్రత్యేక పాత్ర..
నాడు ఉద్యమానికి కేంద్ర బిందువుగా కంటోన్మెంట్ స్వరాష్ట్ర సాధనలో ప్రత్యేక పాత్ర పోషించింది. నాటి ఉద్యమ సహచరుల కృషి మరవలేనిది. దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నేడు కంటోన్మెంట్ నుంచి తెలంగాణ భవన్ వరకు సుమారు 300 వాహనాలతో భారీగా తరలివెళ్లనున్నాం.
– గజ్జెల నాగేశ్, మాజీ చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్
మహనీయుడు కేసీఆర్
14 ఏండ్లు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్. ఉద్యమ చరిత్రలో కేసీఆర్ పోరాటం, ఆయన దీక్ష చెరగని ముద్ర వేసింది. ఆ దీక్ష ను మరోసారి మననం చేసుకుందాం.
– మన్నె క్రిశాంక్, మాజీ చైర్మన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ
కేసీఆర్ పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం
బంజారాహిల్స్, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ సారథి, మాజీ సీఎం కేసీఆర్ పోరాట స్ఫూర్తి మనందరికి ఆదర్శమని, దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో శుక్రవారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించనున్నామన్నారు.
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన మాజీ సీఎం కేసీఆర్.. రాష్ర్టాన్ని కూడా అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఉద్యమకారులు తరలిరావాలని కోరారు. ర్యాలీగా తెలంగాణ భవన్‌కు వెళ్లాల్సి ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్పొరేటర్లు, డివిజన్ బీఆర్ఎస్ నేతలు, ముఖ్య నాయకులు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.