,Uttarakhand | డెహ్రడూన్, మార్చి 2: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాల్ని ఆర్మీ సిబ్బంది వెలికితీసింది. దీంతో 60 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని రక్షణ శాఖ అధికారి మనీశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఘటనలో మొత్తం 54 మంది బీఆర్వో కార్మికులు గల్లంతయ్యారని, ఇందులో 46 మందిని రక్షించామని, 8 మంది చనిపోయారని చమోలీ కలెక్టర్ సందీప్ తివారీ చెప్పారు. గత శుక్రవారం బీఆర్వో క్యాంప్ వద్ద పెద్ద మంచుచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
ప్రేయసి తల్లిపై హత్యాయత్నం ;పెళ్లికి ఒప్పుకోవడం లేదని యువకుడి ఆగ్రహం
రామడుగు, మార్చి 2: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం సుద్దాలపల్లిలో జరిగిన ఓ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రాజ్‌కుమార్, అదే గ్రామ యువతిని ప్రేమించాడు. అతని వ్యవహారశైలి నచ్చక ఏడాదిగా ఆమె దూరం పెట్టినా పెండ్లి చేసుకోవాలని యువతిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లి ఆమెకు మరో సంబంధం కుదిర్చింది. దీంతో రగిలిపోయిన యువకుడు శివరాత్రి రోజు యువతి ఇంటికి వెళ్లి ఆమె తల్లిని చంపేందుకు యత్నించాడు. యువతి అతన్ని అడ్డుకోవడంతో తల్లి ప్రాణాలతో బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు యువకున్ని రిమాండ్‌కు తరలించారు.