Cancer | న్యూఢిల్లీ: ఒక క్యాన్సర్ కణం.. ఇంకో ఆరోగ్యకర కణాన్ని లొంగదీసుకుంటుంది. అలా ఒక్కో కణం.. ఇంకో కణాన్ని లొంగదీసుకుంటూ క్యాన్సర్ అంతటా పాకుతుంది. ఈ దశలో రోగనిరోధక వ్యవస్థ కుంటుపడుతుంది. అలసట, బలం లేకపోవటం, ఏ పని చేద్దామన్నా శరీరం సహకరించకపోవటం లాంటి సమస్యలు వస్తాయి. అయితే.. క్యాన్సర్ కణం చూపే ప్రభావం కన్నా.. అలసట, బరువు తగ్గిపోవటం (కాచెక్సియా) వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
‘ఒక క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడు ఈ దశలోకి వచ్చారంటే.. వ్యాధి నయం కావటం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఈ దశలో చికిత్స లేనేలేదు’ అని అమెరికాకు చెందిన కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ ల్యాబొరేటరీ (సీఎస్హెచ్ఎల్) శాస్త్రవేత్తలు వివరించారు. 50-80 శాతం పేషెంట్లు ఇలాగే మరణిస్తున్నారని వెల్లడించారు. రోగుల్లోని రోగనిరోధక వ్యవస్థలో ఇంటర్‌ల్యూకిన్-6 (ఐఎల్-6) అణువు మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దాంతో కాచెక్సియా దశలోకి చేరుతారని పేర్కొన్నారు. ఎలుకల్లోని న్యూరాన్లకు ఐఎల్-6 ప్రభావం చేరకుండా అడ్డుకొని పరిశీలించగా, కాచెక్సియా ప్రభావం లేదని దాంతో ఆ ఎలుక మెదడు ఆరోగ్యంగా ఉండి, మరిన్ని రోజులు బతికిందన్నారు.
ఆరోగ్యవంతుల్లో ఐఎల్-6 పాత్ర చాలా కీలకమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అణువు శరీరమంతా ప్రవహించి, సహజ రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరిశీలిస్తుందని, ముప్పు ఎదురవుతుందని తెలిస్తే వెంటనే మెదడుకు సమాచారం చేరవేస్తుందని తెలిపారు.