జోగులాంబ గద్వాల : జిల్లాలో నకిలీ విత్తనాలను ( Fake seeds ) అరికట్టే పూర్తి బాధ్యత డీలర్లపై ఉందని జిల్లా కలెక్టర్ బీయం సంతోష్ (Collector Santosh ) అన్నారు. శనివారం ఐడీఓసీ సమావేశం హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సౌజన్యంతో డీలర్లకు ఈ-పోస్ యంత్రాల పంపిణీలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ( SP Srinivas rao) తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నకిలీ విత్తనాలను అరికట్టి, అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈసారి రుతుపవనాలు ముందుగానే వస్తుండటంతో, వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచనల మేరకు రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారన్నారు.
జిల్లాలో రైతులు ఎన్నో ఆశలతో పత్తి సాగు చేస్తారని, నకిలీ విత్తనాల వలన వారి శ్రమ వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత డీలర్లపై ఉందని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించకుండ నాణ్యమైన ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే విక్రయించాలన్నారు. ఈ విషయంలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం తగదని హితవు పలికారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా పీడీ యాక్ట్ (PD Act, ) నమోదు చేస్తామని పేర్కొన్నారు.
పూర్తి స్థాయిలో నిఘా : ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం మేరకు రైతులు నకిలి విత్తనాలతో మోసపోకుండా వాటి సరఫరాపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచి కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. నకిలీ విత్తనాల పై రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా జిల్లా సరిహద్దులో 6 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అడ్డుకున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సంగీత లక్ష్మి, జిల్లా కో-ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్, డీఎస్పీ మొగలయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారులు, కోరమాండల్ ప్రతినిధి గోవింద్ రావు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.