బండెనక బండి.. జోడెడ్ల బండి.. జోరుజోరు బండి! ఊరూరా.. వాడవాడలా.. సందడి చేస్తాయి! మల్లన్న జాతర కోలాహలం కాదిది. పోలేరమ్మకు మొక్కులు తీర్చుకునే పండుగ అంతకన్నా కాదు! విత్తనాల తిరునాళ్లివి. జాతి వంగడాల ఆనవాళ్లు కాపాడుకునేందుకు మహిళా రైతులు చేస్తున్న ఉత్సవం ఇది. పాతికేళ్లుగా పాత పంటకు కాపు కాస్తున్న అతివల సంబురం అంబరాన్నంటుతున్నది. సంగారెడ్డి జిల్లాలో విత్తన లక్ష్మికి రక్ష కడుతూ ఏటా కర్షక వనితలు చేస్తున్న ముచ్చటకు మళ్లీ వేళయింది.
పంటచేలో పాలకంకి నవ్వులు చూడాలనుకున్నారు వాళ్లు. చిన్ని చిన్ని కమతాలే భవిష్యత్ తరాలకు పెద్ద దిక్కు కావాలని నిశ్చయించుకున్నారు. చిరుధాన్యలక్ష్మిని రక్షించాలని, జీవ వైవిధ్యాన్ని కాపాడాలని సంగారెడ్డి జిల్లా పస్తాపూర్‌లోని దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) మహిళా రైతులు సంకల్పించుకున్నారు. ఈ క్రమంలో 25 ఏండ్లుగా పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు. సొసైటీతో అనుబంధం ఉన్న గ్రామాలన్నీ ఈ క్రతువులో భాగమవుతాయి. ఈ పల్లె రైతులకు విత్తనాలే దైవం. భూసారాన్ని పరిరక్షించుకోవడమే వాళ్లు నేలతల్లికి సమర్పించే ముడుపు.
సంక్రాంతి వేళ ఇంట్లో మూకుడు సంగతి పట్టించుకోరు ఇక్కడి మహిళలు. విత్తనాలను కాపాడుకోవడమే విధిగా భావిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన బండ్లతో రోజుకో ఊరు తిరుగుతూ, ఆటపాటలతో పంటల ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు. విత్తనాలను ఎలా కాపాడుకోవాలో పాటలు అల్లి చెబుతారు. సాగుబడి ఎలా కొనసాగించాలో అవగాహన కల్పిస్తారు. కోలాటాలు, సంతర్పణలు అబ్బో దాదాపు నెల రోజులు ఆ పల్లెల్లో పిల్లాజెల్లా, చిన్నాపెద్దా అందరూ ఈ వేడుకలో భాగం అవుతారు. సంక్రాంతి నాడు అంటే ఈ నెల 14న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి గ్రామంలో పాత పంటల జాతర మొదలుకానుంది. జహీరాబాద్, రాయికోడ్ మండలాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు చుడుతూ ఫిబ్రవరి 11న ఝరాసంగం మండలం మాచునూరు చేరుతుంది. అక్కడి పచ్చశాల ప్రాంగణంలో జరిగే సభతో విత్తన మేళా ముగుస్తుంది.
ఈ పాత పంటల జాతరలో ఎడ్లబండ్ల ముస్తాబు ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. బండిపై ధాన్యపు కంకులు అలంకరించి విత్తనాల ప్రాధాన్యాన్ని తెలియజేస్తారు. మగవాళ్లు బండ్లు తోలుతుంటే.. ఆడపడుచులు వాటి ముందు కోలాటం ఆడుతూ సందడి చేస్తారు. పల్లె పదాలతో పంట ప్రాధాన్యాన్ని వివరిస్తారు. ఎడ్లబండ్లకు మంగళహారతులు పట్టి స్వాగతం పలుకుతారు. వాళ్లు తీసుకొచ్చిన విత్తనాల కంకులకు పూజలు చేస్తారు. సాగుబడిలో సవ్యసాచులు అనిపించుకున్న కర్షక వనితలు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకుంటారు. పంట నుంచి మేలురకం వంగడాలు ఎలా సేకరించాలో, వాటిని ఎలా భద్రపర్చుకోవాలో తెలియజేస్తారు. అంతేకాదు పంటలు పండించే విధానాలను వీడియోల రూపంలో ప్రదర్శించి సాగుబడి పాఠాలు చెబుతారు. తాము సేకరించిన విత్తనాల గురించి వివరించి, ఆసక్తి కనబరచిన రైతులకు వాటిని అందజేస్తారు.
రాగులు, కొర్రలు, అవిసెలు, జొన్నలు, సామలు, సజ్జలు, ఉలవలు, బొబ్బర్లు తదితర పంటల్లో డీడీఎస్ మహిళా రైతులు ఏటా 40 రకాలు సాగు చేస్తున్నారు. ఈ సాగు చేసిన పంటలు చేతికి రాగానే.. ముందుగా విత్తనాలు సేకరిస్తారు. వాటిని సంప్రదాయ పద్ధతుల్లో భద్రపరుస్తారు. ఈ క్రమంలో ఏటికేడూ నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా వాళ్లు పనిచేస్తున్నారు. పంట సాగులోనూ సేంద్రియ విధానాలు అవలంబిస్తున్నారు డీడీఎస్ రైతులు. రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకంతో సారం కోల్పోయి భూమి కలుషితమై పోతున్నది. ఇలాంటి నేలల్లో పండిన పంటలు తినడం వల్ల మనుషులు, పశువులు అనేక రోగాలకు గురవుతున్నారు. ఈ దుస్థితి తప్పించాలని కంకణం కట్టుకున్నారు వీళ్లు. సేంద్రియ ఎరువులు, రకరకాల ఆకులు అలముల కషాయాలను వినియోగించి పంటలనే కాదు, నేల తల్లినీ కాపాడుకుంటున్నారు. తాము సాగు చేస్తున్న పంట విధానాలను చెప్పి ఈ తరం రైతులనూ సేంద్రియ సాగు వైపు మళ్లించేందుకు అహరహం కృషిచేస్తున్న మహిళా రైతులకు సాహో! పాతికేళ్లుగా మొక్కవోని దీక్షను కొనసాగిస్తున్న దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి జయహో!
కనుమరుగువుతున్న పాత పంటలను పరిరక్షించేందుకు డీడీఎస్ మహిళా రైతులు కృషి చేస్తున్నారు. రసాయన ఎరువులు వినియోగించడంతో పంటలు కలుషితం అవుతున్నాయి. వాటిని తిన్నవాళ్లూ రోగాల పాలవుతున్నారు. మన పంటలను కాపాడుకుంటేనే భావితరాలు మనగలుగుతాయి. ఈ లక్ష్యంతోనే పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు డీడీఎస్ మహిళా రైతులు. పాత పంటల విత్తనాల సేకరణ, సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలతో కలిగే లాభాల గురించి ఊరూరా తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. డీడీఎస్ సేవలు గ్రామీణ ప్రాంతాలకే కాకుండా హైదరాబాద్‌తో పాటు పలు నగరాలకు విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం సహకరిస్తే చిరుధాన్యాల సాగును మరింత విస్తరించేందుకు కృషి చేస్తాం.