UK MPs : ఇజ్రాయెల్ (Israel) కు వెళ్లిన ఇద్దరు బ్రిటన్ (Britain) ఎంపీల (MPs) ను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు తెలుస్తోంది. టెల్అవీవ్ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ (David Lammy) తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అధికార లేబర్ పార్టీకి చెందిన యువాన్ యాంగ్ (Yuan Yang) ఎర్లీ వుడ్డీ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అబ్తిసామ్ మొహమ్మద్ (Abtisam Mohamed) షెఫీల్డ్ సెంట్రల్‌కు ఎంపీగా ఉన్నారు.
ఆ ఎంపీలు శనివారం లుటాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. వారిని అక్కడి అధికారులు అడ్డుకుని నిర్బంధించారు. అనంతరం కొంత సమయం తర్వాత విడిచిపెట్టారు. తమ భద్రతాదళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడంతోపాటు తమపై వ్యతిరేకతను పెంచేందుకు ఆ ఎంపీలు వచ్చారని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే వారి రాకను అడ్డుకున్నట్లు తెలిపింది. అయితే ఇజ్రాయెల్ చర్యపై లామీ స్పందించారు.
ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన తమ ఇద్దరు ఎంపీలను అక్కడి అధికారులు నిర్బంధించారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. వారి చర్య తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. తమ ఎంపీలతో వారు ఈ విధంగా వ్యవహరించడం సరికాదని, ఇదే విషయాన్ని అక్కడి ప్రభుత్వంలోని తన సహచరులకు స్పష్టం చేశానని చెప్పారు. ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి నెలకొల్పడం వంటి అంశాలకు సంబంధించిన చర్యలపైనే తమ ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అన్నారు.