ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాకు చెందిన గిరిజన దంపతులకు తీవ్ర విషాదం ఎదురైంది. సఖరం (28), అవిత (26) దంపతులు తెలిపిన వివరాల ప్రకారం, వీరిద్దరూ దినసరి కూలీలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడో బిడ్డ కాన్పు కోసం ఇటీవలే సొంతూరుకు వెళ్లారు. ఈ నెల 11న ఆమెకు నొప్పులు రావడంతో అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. కానీ అది రాలేదు. గ్రామంలోని ఆశా వర్కర్ కోసం ప్రయత్నించారు. ఆమె కూడా అందుబాటులో లేదు. చివరికి ఆశా వర్కర్ ఓ ప్రైవేట్ వాహనాన్ని ఏర్పాటు చేసి, ఖోదల ప్రజారోగ్య కేంద్రానికి అవితను తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అవిత గర్భంలో కదలికలు వచ్చాయి.
పీహెచ్‌సీకి చేరుకున్న తర్వాత గంటకుపైగా వేచి ఉండేలా చేశారు. అక్కడి వైద్యులు మొఖడ గ్రామీణ దవాఖానకు వెళ్లాలని చెప్పారు. అక్కడ ఆమెను ఓ గదిలో ఉంచారు. ఆమె భర్త నిరసన తెలపడంతో పోలీసులను పిలిచి, అతనిని కొట్టించారు. అక్కడి డాక్టర్లు ఆమెను నాసిక్ సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాలని చెప్పారు. అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో 25 కి.మీ. దూరంలోని ఆసే గ్రామం నుంచి అంబులెన్స్‌ను రప్పించారు. అవిత నాసిక్ దవాఖానకు చేరుకుంది. ఈ నెల 12న రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఆమెకు మృత ఆడ శిశువు జన్మించింది. మృతదేహాన్ని ఆ మర్నాడు సఖరంకు అప్పగించారు. కానీ ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ను పంపించలేదు. దీంతో సఖరం రూ.20 చెల్లించి ఓ క్యారీ బ్యాగ్‌ను కొని, గుడ్డలో చుట్టిన మృతదేహాన్ని ఆ కవరులో పెట్టి, 90 కి.మీ. దూరంలోని తన స్వగ్రామానికి బస్సులో వెళ్లారు. అక్కడ అంత్యక్రియలు పూర్తి చేశారు. తిరిగి నాసిక్ దవాఖానకు వచ్చారు. అక్కడ అవిత బలహీనంగా ఉన్నప్పటికీ వైద్యులు ఆమెకు మందులు ఇవ్వలేదు. ఇరువురూ కలిసి బస్సులోనే స్వగ్రామానికి చేరుకున్నారు.