South Africa | న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా కుమార్తె నొమ్సెబో జుమా (21), ఎస్వతిని రాజు ఎంస్వతి-2 (56) మధ్య ప్రేమ చిగురించింది. సంప్రదాయ నృత్య సంబరాల్లో పాల్గొన్న నొమ్సెబోను రాజవంశపు పెండ్లి కుమార్తెగా ప్రకటించారు. వీరి వివాహం త్వరలో జరగబోతున్నది. ఎంస్వతి-2కు ఇది 16వ వివాహం. ఆయనకు ప్రస్తుతం 11 మంది భార్యలు ఉన్నారు. నొమ్సెబో ఆయనకు 16వ భార్య కాబోతున్నారు. కింగ్ ఎంస్వతి, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకోబ్ జుమా బంధువులే.
హత్రాస్ రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లో శుక్రవారం ఓ బస్సు, వ్యాను ఢీకొనడంతో 15 మంది మరణించగా, 16 మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు అధికారులు చెప్పారు. ఆగ్రా-అలీగఢ్ జాతీయ రహదారిపై బస్సు ఓ వ్యానును ఢీకొట్టింది. కన్వర్పూర్ గ్రామం వద్ద ఈ దారుణం జరిగింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ.50,000 చొప్పున ఆర్థిక సాయాన్ని మోదీ ప్రకటించారు.
‘సామూహిక రేప్ జరగలేదు’
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై సామూహిక రేప్ జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని సీబీఐ తోసిపుచ్చింది. తమకు లభించిన ఆధారాలను బట్టి పోలీసులు అరెస్ట్ చేసిన సంజయ్ రాయ్‌కి మాత్రమే ఇందులో సంబంధం ఉందని శుక్రవారం సీబీఐ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేసి సోదాలు నిర్వహించింది. ఆయన హయాంలో మెడికల్ కాలేజీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు దాడి చేశారు. ఆయనకు సన్నిహితులైన ముగ్గురి నివాసాలపై కూడా ఈడీ దాడులు చేసింది.