మంచిర్యాల, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): తల్లి మరణాన్ని తట్టుకోలేక రోదిస్తూ కూతురు గుండెపోటుతో కుప్పకూలింది. ఈ విషాద ఘటన మంచిర్యాలలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల ఏసీసీ ఏరియాలోని అంబేద్కర్‌నగర్‌లో మైస లక్ష్మి(60), మల్లయ్య దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. అందరికీ వివాహాలయ్యాయి. లక్ష్మీ దంపతులు మంచిర్యాలలోని పెద్ద కుమారుడి వద్ద ఉంటున్నారు. కూతురు సిలువేరు సరస్వతి (35) మంచిర్యాలలో ఉద్యోగం చేస్తూ ఏసీసీలోనే ఉంటున్నది. మైస లక్ష్మికి శనివారం తెల్లవారుజామున కడుపు నొప్పి రావడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తీసుకెళ్లారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు రిఫర్ చేశారు. లక్ష్మి వెంట కూతురు సరస్వతి కూడా వెళ్లింది. కరీంనగర్ సమీపానికి చేరుకునే సరికి లక్ష్మి మృతిచెందింది. కండ్లముందే తల్లి మృతిచెందడంతో సరస్వతి తల్లడిల్లిపోయింది. తల్లి మృతదేహంపై పడి బోరున ఏడుస్తూనే ఆదివారం తెల్లవారుజామున స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబీకులు దవాఖానకు తీసుకెళ్లగా.. గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తల్లీ కూతుళ్ల మృతితో మంచిర్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.