కరీంనగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సమాజంలో అత్యంత వెనుకబడిన దళితులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం నిరుపేద దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. వారి జీవితాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నది. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు ఫలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇప్పటికే 6,354 మంది లబ్ధిదారులకు 5,747 యూనిట్లను పంపిణీ చేయగా, సీఎం ఆదేశాలతో మంత్రి గంగుల కమలాకర్ యూనిట్ల పంపిణీని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
దళితబంధు ప్రారంభించినప్పటి నుంచి లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న యూనిట్లను ఎంపిక చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఏడాది పొడుగునా ఉపాధి అవకాశాలు ఉన్న పాడి పరిశ్రమను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు.
ఇచ్చిన యూనిట్లలో 1,389 మంది లబ్ధిదారులు డెయిరీ యూనిట్లనే ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. వ్యక్తిగత యూనిట్లతోపాటు రిటైల్ విభాగంలో వ్యాపార యూనిట్లు, ట్రాన్స్పోర్టు రంగంలో వాహనాలను అందిస్తున్నారు. 5,354 మందికి వ్యక్తిగత యూనిట్లను పంపిణీ చేశారు. రిటైల్ విభాగంలో 61 మందికి 26 యూనిట్లు పంపిణీ చేశారు. ట్రాన్స్పోర్టు రంగంలో 939 మందికి 367 యూనిట్లు పంపిణీ చేశారు. మొత్తంగా చూస్తే 6,354 మంది లబ్ధిదారులకు 5,747 యూనిట్లను పంపిణీ చేశారు.
పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొన్న హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబాన్ని పథకం కింద ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆది నుంచి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటున్నది. నియోజవర్గంలో 17 వేలకు పైగా కుటుంబాలను గుర్తించిన అధికారులు ఇప్పటికే 5,747 యూనిట్లను పంపిణీ చేశారు. మిగతా యూనిట్లను పంపిణీ చేసేందుకు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. లబ్ధిదారుల అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నారు. అనుభవం లేకపోతే శిక్షణ ఇస్తున్నారు. తర్వాతే యూనిట్లు గ్రౌండింగ్ చేస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న వారు మన్యాల రాధమ్మ, ఆమె కూతురు చిత్తారి సుమలత. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లికి చెందిన వీరు నిన్నామొన్నటి వరకు ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ, ఇతరుల పొలాల్లో కూలీలుగా పనిచేస్తూ జీవించేవారు. పేదరికంలో ఉన్న వీరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధులో భాగంగా వచ్చిన వరికోత యంత్రం(హార్వెస్టర్)తో నేడు వీరి జీవితాలు మారిపోయాయి. వరి కోతలు ఊపందుకోవడంతో 20 రోజుల నుంచి హార్వెస్టర్ రోజుకు 10 నుంచి 12 గంటలపాటు పనిచేస్తున్నది. గంటకు రూ.1800 చొప్పున రోజుకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తుండగా.. ఖర్చులు పోనూ రూ.10 వేల నుంచి రూ.12 వేలు మిగులుతున్నాయని సంతోషంగా చెప్తున్నారు. గతంలో ఒకరి కింద కూలీలుగా పనిచేసిన వీరు ప్రస్తుతం నలుగురికి ఉపాధి కల్పించడంతోపాటు వాళ్లూ ఉపాధి పొందుతున్నారు. ఇప్పటివరకు హార్వెస్టర్ ద్వారా ఖర్చులు పోనూ రూ.2 లక్షల వరకు ఆదాయం వచ్చిందని సంబురంగా చెప్తున్నారు.