హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలపక్షాన నిలుస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా పేరుగాంచిన ‘టీన్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు కలవరపెడుతున్నాయి. గతేడాది ‘నమస్తే తెలంగాణ’ సర్వర్లపై సైబర్ నేరస్తుల దాడిని మరువకముందే.. ‘టీ న్యూస్’ యూట్యూబ్ సర్వర్లపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సైబర్ అటాక్ జరిగినట్టు గుర్తించిన ‘టీ న్యూస్’ యాజమాన్యం శనివారం ఉదయం సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేసింది. ప్రజలకు ‘టీ న్యూస్’ ప్రసారాలు చేరకుండా కుట్ర చేస్తున్నారని, ఈ ఘటనతో చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది.
దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేసినట్టు పేరొంది. సాధ్యమైనంత త్వరగా ‘టీ న్యూస్’ యూట్యూబ్ సేవలను తిరిగి ప్రజల ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. ప్రజలపక్షాన నిలుస్తూ, ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ‘టీ న్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని సైబర్ నిపుణులు అంటున్నారు. వీటిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.