కంప్యూటర్లు, సెల్ఫోన్లను చాలా మంది సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే వాడేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించడం, ఇంటర్నెట్తో అనుసంధానమైన ఇలాంటి విషయాల గురించి పెద్దలకు సరిగ్గా తెలియదు. అందుకే సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థి దశలోనే అవగాహన కల్పించడంతో వాటిని నియంత్రించవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర మహిళా పోలీసు భద్రతా విభాగం సైబర్ కాంగ్రెస్‌కు శ్రీకారం చుట్టింది.
సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులు నేర్చుకొని నిపుణులుగా మారనున్నారు. తోటి విద్యార్థులకు, నివాస పరిసరాల్లో పెద్దలకు అవగాహన కల్పిస్తూ సైబర్ అంబాసిడర్లుగా అవతారం ఎత్తనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ, మహిళా రక్షణ విభాగం సంయుక్తంగా సైబర్ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని 6-10 తరగతులకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తున్నది. కామారెడ్డి జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసి ఒక్కో పాఠశాలలో ఇద్దరు సైబర్ అంబాసిడర్లను నియమించింది. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులనూ శిక్షణలో భాగస్వాముల్ని చేస్తున్నది.
ఆన్లైన్ తరగతుల కారణంగా స్మార్ట్‌ఫోన్‌ను విద్యార్థులు అధికంగా వినియోగిస్తున్నారు. అవగాహన లేక సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఫోన్ చేసే అపరిచిత వ్యక్తులకు స్పందించి తమ ఏటీఎం వివరాలు చెప్పి లక్షలు పోగొట్టుకుంటున్న వారూ ఉన్నారు. కంప్యూటర్, మొబైల్లో అనవసర వెబ్సైట్ల లింక్‌లు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి. అలాగే బాలికల భద్రత విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సరైన దృష్టి సారించకపోవడంతో కొంతమంది విద్యార్థులు పెడదారిన పడుతున్నారని ఉన్నతాధికారులు గ్రహించారు. దీనికి ప్రధానకారణం ప్రజల్లో అవగాహన లేకపోవడమే అని చెప్పవచ్చు. దీంతో బాలబాలికలు సైబర్ నేరాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడానికి సైబర్ అంబాసిడర్లు రంగంలోకి దిగారు.
ఇలా అవగాహన కల్పిస్తారు..
ఆన్లైన్ ద్వారా మోసాలు, ఇంటర్నెట్ను సరైన విధానంలో ఉపయోగించడం, మొబైల్‌ను సరైన పద్ధతిలో వాడడం మొదలగు వాటిపైన విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి 8.30గంటల వరకు జూమ్ యాప్ ద్వారా తరగతులు నిర్వహిస్తారు. అనంతరం వారి పాఠశాలలో మిగతా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. జిల్లాలో విద్యాశాఖ కోఆర్డినేటర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి, అందులో జిల్లా విద్యాశాఖ అధికారి, సైబర్ కాంగ్రెస్ హైదరాబాద్ అధికారులు, షీటీమ్ పోలీసు అధికారులు ఉంటారు. విద్యార్థులకు ప్రతివారం సైబర్ నేరాల సమస్యలకు పరిష్కారం,ఆన్లైన్ సద్వినియోగం చేసుకోవడంపై వివరిస్తారు. తరుచూ సర్వేలతో విద్యార్థుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను భాగస్వామ్యం చేస్తారు
జిల్లాలో 50 పాఠశాలలు ఎంపిక
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 1011 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రతి మండలం నుంచి రెండు నుంచి నాలుగు పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా విద్యార్థులు కలిగిన 50 పాఠశాలలను విద్యాశాఖ అధికారులు ఎంపిక చేసి, ప్రతి పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడిని, 8,9 తరగతుల నుంచి ఇద్దరు విద్యార్థులను సైబర్ అంబాసిడర్ సెలెక్ట్ చేస్తున్నారు. వీరిలో ఒక బాలుడు, ఒక బాలిక ఉంటారు. సమగ్ర శిక్షా, స్థానిక షీటీమ్ సిబ్బంది, యంగిస్తాన్ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజర్), రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. వీరికి పది నెలల పాటు శిక్షణ అందించనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు శిక్షణ ఇస్తారు. సైబర్ నేరాలు-అప్రమత్తతపై అవగాహన కల్పిస్తారు. ఆన్లైన్ మోసాలు, ఫేస్బుక్, వాట్సాప్ వేదికల ద్వారా చోటు చేసుకునే అనుచిత ధోరణులకు ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తారు. ప్రతి నెలలో వారం రోజుల పాటు ఆన్లైన్ ద్వారా సైబర్‌నేరాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. విద్యావేత్తలు,మేధావులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నారు. 50 బృందాల పేరు మీద 50 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తారు.
ముందుగానే పసిగట్టవచ్చు..
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు వాడడంతో ఆన్లైన్ మోసాలను కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అవగాహన ఉంటే సైబర్ మోసాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్తగా ఉండొచ్చు. నా తోటి విద్యార్థులకు, ఇంటి చుట్టు పక్కల వారికి సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తా.
-శిరీష, కేజీబీవీ, లింగంపేట్
మోసపోకుండా అవగాహన కల్పిస్తాం..
సైబర్ మోసాలపై మాకు అవగాహన కల్పిస్తే మా ద్వారా ఇతరులకూ వాటి గురించి తెలుస్తుంది. చాలా మంది ఆన్లైన్ మోసాలంటే తెలియకుండా ఫోన్లకు వచ్చే ఓటీపీలను అగంతకులకు చెప్పి మోసపోతున్నారు. మేమంతా వాటిపై శిక్షణ పొంది మా పరిధిలో ఎవరూ సైబర్ మోసాల బారిన పడకుండా చూస్తాం.
సైబర్ నేరాలను అరికట్టవచ్చు..
ఆన్లైన్ తరగతులతో విద్యార్థులు సైబర్ మోసాల బారినపడుతున్నారు. సైబర్ కాంగ్రెస్ వల్ల విద్యార్థులను సైబర్ నేరాల నుంచి అరికట్టవచ్చు. ప్రతి విద్యార్థి సైబర్ నేరాలపై, ఆన్లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లాలో 50 పాఠశాలల్లో 50 మంది ఉపాధ్యాయులు, 100 మంది విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేశాం.
-గంగాకిషన్, జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త