చెమటలు కక్కే జిమ్‌లో.. చాక్లెట్ సువాసనలు పెనుమార్పులు తీసుకొస్తున్నాయి. వ్యాయామం చేసేవారిలో ఆకలిని తగ్గిస్తున్నాయి. వారి వ్యాయామ పనితీరును పెంచుతున్నాయి. ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎక్కువ కోకో ఉండే డార్క్ చాక్లెట్‌ను వాసన చూడటం వల్ల.. కసరత్తులు చేసేవారిలో ఆకలి, తినాలనే కోరిక తగ్గిపోయినట్లు పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో అలసటకు గురికాకుండా.. వ్యాయామ సెట్లలో మరిన్ని ఎక్కువసార్లు బరువులు ఎత్తగలిగినట్లు తెలిపారు. ఇక తక్కువ కోకో ఉండే మిల్క్ చాక్లెట్ వాసన చూడటం వల్ల వ్యాయామం మరింత ఆహ్లాదకరంగా మారినట్లు వెల్లడించారు. ఈ పరిశోధనలో భాగంగా ఆరోగ్యవంతులైన, మధ్యస్థంగా వ్యాయామ శిక్షణ పొందిన 23 మంది యువకులను ఎంపిక చేశారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించి.. మూడు వేర్వేరు శాంపిల్స్‌ను అందించారు.
కొందరికి డార్క్ చాక్లెట్ (90 శాతం కోకో), మరికొందరికి మిల్క్ చాక్లెట్ (60 శాతం కోకో), మిగతావారికి సాధారణ నీళ్లు ఇచ్చారు. శాంపిల్స్ వాసన చూస్తూ వ్యాయామం చేసేలా వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు. నీళ్లు మాత్రమే తాగిన పార్టిసిపెంట్స్‌తో పోలిస్తే.. డార్క్ చాక్లెట్ వాసన చూసినవారు 18 ఎక్కువ రిపిటేషన్స్ చేయగలిగారట. అదే, మిల్క్ చాక్లెట్ వాసన చూసినవారు.. తొమ్మిది ఎక్కువ రిపిటేషన్స్ చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు.
అదే సమయంలో తాము మరింత కష్టపడుతున్నట్లు భావించకుండానే, ఎక్కువసేపు వ్యాయామం చేసినట్లు కనుగొన్నారు. ఇందుకు కారణాలను వివరిస్తూ.. కాస్త చేదుగా, రిచ్‌గా ఉండే డార్క్ చాక్లెట్ సువాసన జీర్ణ వ్యవస్థను కడుపు నిండిన స్థితిలోకి తీసుకొస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అందుకే, చాక్లెట్ వాసన చూడటం వల్ల పార్టిసిపెంట్లలో ఆకలి, తినాలనే కోరిక తగ్గినట్లు చెప్పుకొచ్చారు.