మహబూబ్ నగర్ : రాష్ట్ర పాలన చేతగాక కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం బుద్ధిలేని నిర్ణయాలు తీసుకుంటుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy) , మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ( Ala Venkateshwar reddy) , చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Rammohan Reddy ) ఆరోపించారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు సరైన ప్రణాళిక, రాష్ట్ర ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి లేక అనాలోచిత కార్యక్రమాలు చేపడుతుందని దుయ్యబట్టారు. యాసంగికి క్రాప్ హాలీడే (Crop holiday ) ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బీఆర్ఎస్ హయాంలో క్రాప్ హాలీడే పెట్టకుండా నీళ్లు అందించామని పేర్కొన్నారు. క్రాప్ హాలీడే ప్రకటించకుండా కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని, ఆ ప్రభుత్వాన్ని నీటి కోసం అడగొచ్చు కదాని నిలదీశారు.
జూరాల కింద సొంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిని తీసుకువచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసినా సాగునీళ్లు వాడుకోవడంలో పాలకులకు అవగాహన లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ మంత్రులు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు రోజుకు రెండు టీఎంసీల నీరు అవసరమని పేర్కొన్నారు. జూరాలను భారీ ఎత్తిపోతలకు రిసోర్స్‌గా వాడుకోలేమని స్పష్టం చేసినా ప్రభుత్వానికి అర్థం కావట్లేదని వెల్లడించారు.
శ్రీశైలంలో అట్టడుగున నీళ్లు వాడుకునే విధంగా ఏపీ ప్రాజెక్టు లు నిర్మాణం చేపడుతుంటే నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు ప్రాజెక్టు కోసం 27,100 ఎకరాలు భూసేకరణ చేశామని, దాని గురించి పట్టించుకోకుండా రెండేళ్ల నుంచి ప్రాజెక్టు పనులు పడావు పెట్టారని అన్నారు. 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంప్ లను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
కొడంగల్ నారాయణ పేటకు పాలమూరు రంగారెడ్డికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు పోతాయి. అంతకంటే ఎక్కువ ఖర్చుతో కొడంగల్ నారాయణ పేటకు నీళ్లు తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంగా మాట్లాడుతున్నాడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదు. ఇరిగేషన్ మంత్రికి సబ్జెక్ట్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు . కొడంగల్‌కు పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొని పోతాం అంటే సహించేది లేదని అన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల నర్వ, ఆత్మకూరు, అమరచింత ఎడారిగా మారుతుందని వెల్లడించారు.