టీ 20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో భారతజట్టు ఓటమిపై మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టు కూర్పు సరిగా లేదని, సీనియర్లు విఫలమయ్యారని సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. భారత జట్టు మాజీ ఓపెనర్ కూడా ఏడాది టీ 20 వరల్డ్ కప్‌లో పరుగులు సాధించని సీనియర్ ఆటగాళ్లలో కొందరిని వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో చూడొద్దు అనుకుంటున్నానని చెప్పాడు. అంతేకాదు, వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌కి 2007 వరల్డ్ కప్ మాదిరిగా ఎక్కువమంది యువ ఆటగాళ్లతో కూడిన జట్టుని ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరాడు.
‘2007 ప్రపంచకప్‌లోనూ ఇలాగే జరిగింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరభ్ గూంగూలీ వంటి సీనియర్ ఆటగాళ్లు తప్పుకున్నారు. దాంతో, యువ ఆటగాళ్లకు అవకాశం దొరికింది.ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు, ఫైనల్లో పాకిస్థాన్ని ఓడించి, విజేతగా నిలిచింది. అందుకని వచ్చే ఏడాది వరల్డ్ కప్‌కి యువకులతో కూడిన జట్టుని ఎంపిక చేయాలి’ అని సెహ్వాగ్ చెప్పాడు.
ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లు కేఎల్.రాహుల్, రోహిత్ శర్మ విఫలమయ్యారు. దాంతో, మంచి ఆరంభం లభించక భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. దినేశ్ కార్తిక్ కూడా అంత పెద్దగా ఆకట్టుకోలేదు. బౌలింగ్‌లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, పేసర్ భువనేశ్వర్ వికెట్లు తీయలేకపోయారు. ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం కేఎల్.రాహుల్ తడబడ్డాడు. దాంతో, అతడిపై ఆన్లైన్లో మీమ్స్ వైరల్ అయ్యాయి.