తుర్కయాంజాల్, జనవరి 25: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని సీపీ ఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లో సీపీఎం తెలంగాణ మూడో మహాసభల ముగింపు సభలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ రాష్ర్టాల హక్కులను కాలరాస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్‌ల నియామకం పూర్తిగా కేంద్రం లాగేసుకుని కేంద్రం నుంచి అధికారులను నేరుగా బదిలీ చేస్తున్నదని విమర్శించారు. ముఖ్యంగా తెలంగాణకు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను డిప్యూటేషన్‌పై బదిలీ చేస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా ఏకపక్షంగా అధికారుల నియామకంలో జోక్యం చేసుకోవడం సరికాదని చెప్పారు. కేంద్రం నిర్ణయాన్ని తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్‌తోపాటు బీజేపీయేతర రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఫెడరల్ స్పూర్తికి తూట్లు పొడుస్తున్నదని మండిపడ్డారు. రాష్ర్టాలకు రావాల్సిన ఫైనాన్షియల్ గ్రాంట్స్ ఇవ్వకుండా తాత్సర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఇతర రాష్ర్టాల్లో బీజేపీనీ ఓడించగలిగే బలమైన ప్రత్యర్థి పార్టీలకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తే తాము స్వాగతిస్తామన్నారు. బీజేపీని, టీఆర్ఎస్ను సమానంగా చూడలేమనీ, తెలంగాణలో బీజేపీ ప్రమాదకరమైన శక్తిగా ఎదుగేందుకు మతోన్మాద రాజకీయాలతో కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నంద్యాల నర్సింహా రెడ్డి, జాన్‌వెస్లీ, జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కాడిగల్ల భాస్కర్, కార్యదర్శి వర్గ సభ్యులు సామేల్, జగదీశ్ పాల్గొన్నారు.
సీపీఎం పగ్గాలు మళ్లీ తమ్మినేనికే!
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్సిస్టు) రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌లో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరిరోజు పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకొన్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఒకే నేతను మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకొనే అవకాశం ఉండటంతో మూడోసారి కూడా తమ్మినేనికే పగ్గాలు అప్పగించారు. వచ్చే మహాసభల్లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో వీరభద్రంను కార్యదర్శిగా కొనసాగించాలన్న ప్రతిపాదనకు మహాసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా 15 మంది ఎన్నికయ్యారు. ఇందులో ఎస్ వీరయ్య, సీహెచ్ సీతారాములు, బీ వెంకట్, జూలకంటి రంగారెడ్డి తదితరులకు స్థానం కల్పించారు. మొత్తం 60 మందిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా, ఎనిమిది మందిని రాష్ట్ర కమిటీ ఆహ్వానితులుగా, నలుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా ఎన్నుకొన్నారు. ఐదుగురితో కంట్రోల్ కమిషన్‌ను మహాసభ ఎన్నుకున్నది.