హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : కేంద్ర కార్మిక సంఘాలు చేపడుతున్న సార్వత్రిక సమ్మెకు సీపీఐ మద్దతు ఇస్తున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ర్యాలీలు, ప్రదర్శనల్లో సీపీఐ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటిస్థానంలో కార్పొరేట్‌కు అనుకూలమైన నాలుగు లేబర్ కోడ్లలను కేంద్రం తీసుకొచ్చిందని మండిపడ్డారు.
గతంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. తాజాగా కేంద్రం అమెరికాతోవాణిజ్య ఒప్పందం చేసుకొని, రైతుల ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో ప్రభుత్వ రంగసంస్థలు మొత్తం ప్రైవేట్‌పరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజలు, కార్మికులు, కర్షకులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని కూనంనేని విజ్ఞప్తిచేశారు.