Donald Trump | నేరేడుచర్ల ఫిబ్రవరి 8 : అమెరికాలో అక్రమ వలసదారుల పట్ల ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్న నియంత్రత్వ ధోరణిని సూర్యాపేట జిల్లా సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు నిరసన తెలిపారు. నేరేడుచర్లలో శనివారం ఉదయం ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ సహాయ కార్యదర్శి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. అమెరికాలో అక్రమంగా వలస వెళ్లిన భారతీయుల కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి.. ఒకే టాయిలెట్ ఉన్న విమానంలో 250 మందిని పంపించడం దారుణమని అన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రపంచ పోలీసుగా మారి ప్రపంచ దేశాల్ని తన ఆధిపత్యంలో ఉంచుకునేందుకు మరో హిట్లర్ లాగా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. వలసవాదులను దేశం నుంచి బయటకు పంపించడంలో భాగంగా ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహార శైలిని భారతీయులు ముక్తకంఠంతో ఖండించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీవైఎల్ జిల్లా నాయకులు వాసా కరుణాకర్, వ్యవసాయ కార్మిక సంఘం అంబటి బిక్షం, హుజూర్నగర్ కోదాడ సంయుక్త కార్యదర్శి వాస పల్లయ్య, పీవోడబ్ల్యూ హుజూర్నగర్ నియోజకవర్గ అధ్యక్షురాలు చందన బోయిన లక్ష్మి, ఉపాధ్యక్షురాలు సయ్యద్ రేష్మ, రెడ్డిపల్లి వినయ్, మాతాంగి విజయ్, రజాక్ సయ్యద్, ఉబపల్లి సైదులు, శ్యామల నాగేంద్ర మాలాంబి జానీ బేగం తదితరులు పాల్గొన్నారు.