న్యూఢిల్లీ, జనవరి 6: కరోనా మహమ్మారి ఆతిథ్య రంగాన్ని వదలడం లేదు. దాదాపు గత రెండేండ్లుగా కొవిడ్-19తో కుదేలవుతున్న హాస్పిటాలిటీ సెక్టార్.. ఈ ఏడాదీ ఒమిక్రాన్ దెబ్బకు గురైంది. ఏటా క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలతో కళకళలాడే హోటల్స్, రెస్టారెంట్లు.. ఈసారి మాత్రం వెలవెలబోయాయి. ఒమిక్రాన్ ప్రభావంతో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది క్రిస్మస్, న్యూఇయర్ సంబురాలకు దూరంగా ఉన్నారు. దీంతో ముందస్తు బుకింగ్స్ భారీగా రద్దయ్యాయి. ఫలితంగా రూ.200 కోట్ల ఆదాయాన్ని నష్టపోయామని దేశీయ హోటల్, రెస్టారెంట్ సంఘాల సమాఖ్య (ఎఫ్హెచ్ఆర్ఏఐ) గురువారం పీటీఐకి తెలిపింది. కరోనా కేసులు తగ్గి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న ఆనందం.. ఒమిక్రాన్‌తో ఆవిరైపోయిందని ఈ సందర్భంగా సమాఖ్య ఆవేదన వెలిబుచ్చింది.
ప్రభుత్వం చేయూతనివ్వాలి
పెరుగుతున్న కేసులు మళ్లీ ఆంక్షల వలయంలోకి తీసుకెళ్తున్నాయని, ప్రభుత్వ మద్దతు లేకపోతే కోలుకోవడం కష్టమేనని ఇండస్ట్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. మరోసారి నెలకొన్న ఈ అనిశ్చిత వాతావరణంతో ఎంతోమంది ఉద్యోగులు, కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నదని ఇండస్ట్రీ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. జీతాలు, రుణాల చెల్లింపులు భారమవుతున్నాయని పేర్కొంటున్నారు. ‘క్రిస్మస్, కొత్త సంవత్సరం వస్తుందంటే ఎన్నో వేడుకలకు, కార్యక్రమాలకు అంతా సిద్ధం అవుతూంటారు. పెండ్లిళ్ల సీజన్ కూడా కావడంతో ఆతిథ్య రంగం కోలాహలంగా ఉంటుంది. అయితే కరోనాతో ఈ ఉత్సాహం కనుమరుగైపోయింది. భారీ వేడుకలు రైద్దె సాదాసీదాగా ఫంక్షన్లు జరుపుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగా పరిశ్రమకు సుమారు రూ.200 కోట్ల నష్టం వాటిల్లింది’ అని ఎఫ్హెచ్ఆర్ఏఐ సంయుక్త గౌరవ కార్యదర్శి ప్రదీప్ శెట్టి అన్నారు.
తగ్గిన పర్యాటకులు
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తుండటంతో దేశ, విదేశీ పర్యాటకుల రాకపోకలు ప్రభావితమవుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశాయి కూడా. ఇక దేశీయంగా కరోనా మూడో వేవ్ మొదలైందన్న అంచనాలూ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో విదేశీ పర్యాటకులే కాదు.. దేశీయ పర్యాటకుల సంఖ్యా భారీగా పడిపోయిందని ఆతిథ్య రంగ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా రెస్టారెంట్లకు వచ్చేవారు సగానికి తగ్గిపోయారని, హాలిడే-రిసార్టుల పరిస్థితీ ఇలాగే ఉందంటున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ర్టాలు కర్ఫ్యూలను అమలు చేస్తుండగా, మరికొన్ని వీకెండ్ లాక్డౌన్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.