బంజారాహిల్స్, డిసెంబర్ 18 : యూసుఫ్‌గూడ చౌరస్తా నుంచి రహ్మత్‌నగర్ దాకా రోడ్డు విస్తరణ పనుల జాప్యంపై జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన నలుగురు టీఆర్ఎస్ కార్పొరేటర్లు శనివారం జీహెచ్ఎంసీ కౌన్సిల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో యూసుఫ్‌గూడ చౌరస్తానుంచి రహ్మత్‌నగర్ దాకా రోడ్డు విస్తరణ కోసం నోటిఫికేషన్ జారీ చేశారని, ఆరేండ్ల క్రితమే ఆస్తులు కోల్పోతున్నవారికి నష్ట పరిహారం చెల్లించినా విస్తరణపనులు జరగకపోవడానికి కారణమేంటని కార్పొరేటర్ సీఎన్ రెడ్డి కౌన్సిల్లో ప్రశ్నించారు. ఆస్తుల సేకరణ విషయంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావు పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం గజానికి రూ.22 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉన్నా మూడు రెట్లు చెల్లించడంలో భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి పత్రాలను మేయర్‌కు అందజేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు బస్తీలు, కాలనీలను కలిపే ఈ రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా మార్చాలని ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రతిపాదించారని, వెంటనే ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరుపై కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, బాబా ఫసీయుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన మేయర్ మాట్లాడుతూ..రహ్మత్‌నగర్ రోడ్డు విస్తరణ పనుల్లో అవకతవకలపై రెండ్రోజుల్లో విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు. రోడ్డు విస్తరణకు అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు.